Site icon HashtagU Telugu

Hindi language : పాఠశాలల్లో హిందీ భాషపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర ప్రభుత్వం..

Maharashtra government backtracks on Hindi language in schools

Maharashtra government backtracks on Hindi language in schools

Hindi language : మహారాష్ట్రలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులందరికీ హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలు రాజకీయ పార్టీలు, మాతృభాషాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, తాజా పరిణామంగా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బుధవారం మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిందీ భాషను తప్పనిసరి అన్న నిర్ణయాన్ని సవరించింది. కొత్త ప్రకటనలో “తప్పనిసరి” అనే పదాన్ని తొలగిస్తూ, హిందీ బదులుగా విద్యార్థులు ఇతర భాషలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే, ఆయా భాషల్లో బోధన కల్పించేందుకు కనీసం 20 మంది విద్యార్థులు ఆ భాషను నేర్చుకోవాలనే ఆసక్తిని చూపాలని, అప్పుడే ఆ భాష పాఠశాలలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also: Maoists : మావోయిస్టుల మరో ఎదురు దెబ్బ .. ముగ్గురు కీలక నేతలు హతం

అలాగే, ఉపాధ్యాయుల కొరత ఏర్పడిన సందర్భాల్లో ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా బోధన కొనసాగిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా ఉన్న త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తీసుకున్నప్పటికీ, ప్రజల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవ్వడం వల్ల మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన (MNS) అధినేత రాజ్‌ ఠాక్రే, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా స్పందించారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడం మాతృభాషల పరిరక్షణకు విఘాతం కలిగిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల నేతలు ఈ అంశంపై పోరాటానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం కూడా రాజుకుంది.

తమిళనాడు ప్రభుత్వం కూడా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ, ద్విభాషా విధానాన్ని మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా స్పందనల నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, త్రిభాషా సూత్రం భారత ప్రభుత్వ విద్యా విధానంలో భాగమే అయినా, దాని అమలులో రాష్ట్రాలకు స్వచ్ఛందత ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇది వివాదాస్పదంగా మారుతోంది. భాషను నేర్చుకోవడం ఒక విద్యార్థి హక్కు అయితే, మాతృభాషలపై ప్రేమ, గౌరవం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈ రెండు మధ్య సంతులనం పాటించాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.

Read Also: Bomb Threats : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు..బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు