Election Commission of India: దేశంలో మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల్ని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇతర కమిషనర్లతో కలిసి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మహారాష్ట్రలో నవంబర్ 20(బుధవారం)న పోలింగ్ జరుగనుంది. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 9.63 కోట్ల ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. 20 లక్షల మంది తొలిసారి ఓటు వేసే వాళ్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే లక్షా 186 పోలింగ్ స్టేషన్లలో ఈసారి పోలింగ్ జరగబోతోందన్నారు. మహిళల కోసం ప్రత్యేక బూత్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జార్ఖండ్ లో 24 జిల్లాల్లో 81 సీట్లు ఉన్నాయని సీఈసీ తెలిపారు. 2025 లో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుందన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటర్లు ఉన్నారన్నారు. 1706 మంది వందేళ్లు దాటిన ఓటర్లు కూడా ఉన్నారన్నారు. 29562 పోలింగ్ స్టేషన్లలో ఈసారి పోలింగ్ జరగనుందన్నారు.
ఈసారి ఎన్నికల్లో పోలింగ్ బూత్ లలో ఓటరు క్యూలో ఉన్నప్పుడు పక్కనే కూర్చొనేలా కుర్చీలు కూడా వేయించబోతున్నట్లు సీఈసీ తెలిపారు. 85 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే దివ్యాంగులకు కూడా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ తో పాటు ఫిర్యాదుల కోసం కూడా సీవిజిల్ యాప్ కూడా వాడుతున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: 29 అక్టోబర్
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 4
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు..
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి.
మొదటి ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 10
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 10
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 25
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
పోలింగ్: నవంబర్ 13
ఓట్ల లెక్కింపు: నవంబర్ 25
రెండో ఫేజ్
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 22
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 22
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 29
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
పోలింగ్: నవంబర్ 20
ఓట్ల లెక్కింపు: నవంబర్ 23
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 26తో గడువు ముగియనుంది. 36 జిల్లాల నుంచి 288 మంది సభ్యులున్న ఈ అసెంబ్లీ ఇది. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, శివసేన, ఎన్సీపీలు కూటమిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు 2025 జనవరి 25తో ముగియనుంది. ఝార్ఖండ్ అసెంబ్లీలో 24 జిల్లాల నుంచి 81 మంది సభ్యులుంటారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం ఉంది.