No Ambulance : 8 ఏళ్లబాలుడి ఒడిలో తమ్ముడి శవం…అంబులెన్స్ కోసం కన్నతండ్రి నరకయాతన..కన్నీళ్లు తెప్పిస్తోన్న ఘటన..!!

ఓ వైపు దేశం అభివ్రుద్ధిపథంలో ముందుకు దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్నా...మరోవైపు కొన్ని సంఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నామన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి.

  • Written By:
  • Publish Date - July 11, 2022 / 07:27 AM IST

ఓ వైపు దేశం అభివ్రుద్ధిపథంలో ముందుకు దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటున్నా…మరోవైపు కొన్ని సంఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నామన్న విషయాన్ని గుర్తుచేస్తుంటాయి. కనీస అవసరాల కల్పనలో మనం ఎక్కుడున్నాం…సాటివారిపట్ల మానవత్వం కూడా చూపించలేని స్థితిలో ఉన్నామా..ఇలాంటి విషయాలు తేటతెల్లం చేస్తుంటాయి. తాజాగా 8 ఏళ్ల బాలుడు తన 2 ఏళ్ల సోదరుడి మృతదేహాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొరెనాలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

మొరెనాలో 8ఏళ్ల బాలుడు తన 2ఏళ్ల సోదరుడి శవాన్ని తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. తెల్లటి గుడ్డ కప్పిన శవం మీద ఈగలు ఆలుతుంటే..ఏం చేయాలో తెలియని ఆ పసిప్రాణం వాటిని తరుముతు బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. తమ్ముడి మరణంతో బరువెక్కిన గుండెతో తన తండ్రికోసం ఎదురుచూస్తున్న ఆ పసివాడిని చూస్తుంటే గుండెతరుక్కపోతోంది.

అంబాహ్ లోని బద్ ఫ్రా నివాసి అయిన పూజారామ్ జాతవ్ తన కుమారుడైన రాజా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అంబాలోని ప్రభుత్వాసుపత్రిలో రాజాను చేర్పించాడు. పరిస్థితి విషమించడంతో రాజాను వైద్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూజారాం తన 8ఏళ్ల కుమారుడు గుల్షన్ తో కలిసి జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతూ రాజా మరణించాడు. రాజా రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తన కుమారుడి శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పూజారామ్ అంబులెన్స్ కోసం అడగగా 15వందల రూపాయలు అవుతాయని చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేదని ప్రభుత్వ అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందికి వద్దకు వెళ్లాడు. ఆసుపత్రిలో అంబులెన్స్ లేదని ప్రైవేట్ కారు అద్దెకు తీసుకోండని సలహా ఇచ్చారు.

దీంతో పూజారామ్ కు ఏం చేయాలో తోచక…తన పెద్ద కుమారుడైన గుల్షన్ ఒడిలో రాజా శవాన్ని పడుకోబెట్టి…తక్కువ ధరకు వచ్చే అంబులెన్స్ కోసం వెళ్లాడు. గుల్షన్ నెహ్రుపార్క్ ఎదురుగా ఉన్న డ్రైన్ దగ్గర తన తమ్ముడి శంతో కూర్చున్నాడు. గుల్షాన్ తన సోదరుడి శవంతో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న కొత్వాలి టిఐ యోగేంద్ర సింగ్ జాదౌన్ గుల్షాన్..తన సోదరుడి శవాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పూజారామ్ ఆసుపత్రికి చేరుకున్నాడు. తనకు నలుగురు పిల్లలు ఉన్నారని..అందులో రాజా చిన్నవాడని విలపించాడు. పోలీసుల సాయంతో పూజారామ్ తన కుమారుడి శవాన్ని అంబులెన్స్ లో తన సొంత గ్రామానికి తీసుకెళ్లాడు.

ఈ ఘటనపై పీసీసీ అధ్యక్షుడు మాజీ సీఎం కమల్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. శివరాజ్ సర్కార్ ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. 8ఏళ్ల బాలుడు తన తమ్ముడి శవంతో ఆసుపత్రి ఎదుట కూర్చున్నాడు. కుమారుడి శవం గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని అడిగితే…అంబులెన్స్ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు అంబులెన్స్ ను అందించారు. అంబులెన్స్ లు అందుబాటులో లేక గర్భిణీలు కూడా ప్రాణాలు కోల్పోవల్సి వస్తుంది. వైద్యం అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీ నిర్లక్ష్యానికి ఏడుకోట్ల మంది రాష్ట్ర ప్రజలు బలికావద్దని అభ్యర్థిస్తున్నానని ట్వీట్ చేశారు.