By: డా. ప్రసాదమూర్తి
Madhya Pradesh Elections : ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికలు అటు అధికార బిజెపికి, ఇటు ఐక్యత దిశగా అడుగులు వేస్తున్న ప్రతిపక్షాల ఇండియా (INDIA) కూటమికి ఒక అగ్ని పరీక్షగా మారాయి. అధికార ఎన్డీఏలో రథసారథి పాత్ర పోషిస్తున్న బిజెపికి కొత్తగా తన ఐక్యతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ బిజెపిని, ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న ఇతర పక్షాలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలే తాము ఐక్యంగా ఉన్నామని, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా బిజెపితో పోరాడతామని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పుడు జరుగుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే గీటురాయిగా భావించాల్సి ఉంటుంది.
తాము ఐక్యంగా ఉన్నామని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉన్నామని, ఉమ్మడిగా బిజెపితో ఎన్నికల రణరంగంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని విపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా.. అదంతా ఆచరణలో రుజువు కావాల్సి ఉంది. లేకుంటే దేశ ప్రజలు నమ్మరు. అలా రుజువు కావడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా మారాయని చెప్పాలి. ముఖ్యంగా చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ స్థానంలో ఉంది. కానీ అక్కడ వేరే ప్రతిపక్షాలు కూడా పోటీకి సిద్ధపడుతున్నాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ తో ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటాయి.. ఎలాంటి సంయుక్త వ్యూహాన్ని రచిస్తాయి అనేది ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం.
We’re now on WhatsApp. Click to Join.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో కొన్ని రోజులుగా వార్తల్లో విషయం, కాంగ్రెస్ సమాజ్ వాది పార్టీ మధ్య సాగుతున్న చర్చలే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో పక్క ఉత్తరప్రదేశ్లో అతి కీలకమైన సమాజ్ వాది పార్టీ మధ్యప్రదేశ్లో కూడా పోటీకి దిగుతుంది. తమకు తొమ్మిది స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని కోరింది. ఈ విషయంలో ఒక ఒప్పందం కూడా కుదిరిందని మొన్ననే సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు సమాజ్ వాది పార్టీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వీటిలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా రంగంలో ఉన్నారు. మిగిలిన 86 స్థానాల్లో అభ్యర్థులతో రెండవ జాబితా విడుదల చేస్తామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (Madhya Pradesh Congress Party) అధినేత మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. ఒకపక్క సమాజ్ వాది పార్టీతో చర్చలు సఫలమైన వార్త, మరోపక్క ఎవరికి వాళ్లే పోటీగా అభ్యర్థులను ప్రకటించిన వార్త.. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది సాధారణ ప్రజలకే కాదు, రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు పట్టకుండా ఉంది.
ప్రతిపక్షాల ఇండియా కూటమి జాతీయ స్థాయి ఎన్నికలకు సంబంధించినది అని, రాష్ట్రాలకు వచ్చేసరికి ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కమల్ నాథ్ అంటున్నారు. అంటే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో పొత్తు ఇంకా తేలనట్టే అని అర్థమవుతుంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మధ్యప్రదేశ్లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. కమల్ నాథ్ చేసిన తాజా ప్రకటన దృష్టిలో పెట్టుకొని సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. కమల్నాథ్ మనసులో ఉన్న కథ ఏంటో పూర్తిగా చెప్పాలని, బిజెపిని ఓడించాలంటే కాంగ్రెస్ గానీ, సమాజ్ వాది పార్టీ గాని ప్రజల ముందు ఎలాంటి అబద్ధాలు చెప్పకూడదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇది చాలా తీవ్రమైన వ్యాఖ్యగా పరిగణించాలి.
ఇదంతా చూస్తుంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కి, దాని మిత్రపక్షాలైన సమాజ్ వాది పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలకు మధ్య పొత్తు విషయం ఇంకా ఖరారు అయినట్టుగా కనిపించడం లేదు. పోటీ మిత్ర ప్రక్షాల మధ్య కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఒక రాష్ట్రంలోనే విపక్షాల మధ్య ఈ విధమైన పోటీ వాతావరణం నెలకొని ఉంటే తమ మధ్య సామరస్య పూర్వకమైన పొత్తులు అసాధ్యమని దేశానికి చెబుతున్నట్టే అర్థమవుతుంది. కేవలం ఒక రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష మిత్రులతో సయోధ్య కుదుర్చుకోలేకపోతే దేశమంతా ఎలా కుదుర్చుకుంటుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ నాయకుడు యశ్ భారతీయ రాష్ట్రంలో మొత్తం 230 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని మరో ప్రకటన చేసి అక్కడ నెలకొన్న గందరగోళ పరిస్థితికి తాజాగా అద్దం పట్టారు.
ఏది ఏమైనప్పటికీ, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడు జరగబోయే ఐదు రాష్ట్రాలు ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక ఆచరణీయమైన సయోధ్య కుదరకపోతే అది రానున్న కాలంలో దేశవ్యాప్త ఎన్నికల వ్యూహానికి పెద్ద ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. మరి ఈ సమస్యను కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు ఎలా పరిష్కరించుకుంటాయో చూడాలి. లేకపోతే దేశానికి తాము ఉమ్మడిగా ఉన్నామని, కలిసికట్టుగా ఉన్నామని కేవలం మాటలు మాత్రమే చెబుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
Also Read: MLC Kavitha: రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది: ఎమ్మెల్సీ కవిత