Site icon HashtagU Telugu

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి, 25 మందికి గాయాలు

Madhya Pradesh

Resizeimagesize (1280 X 720) (1)

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఖర్గోన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు (Bus Accident) హథిని నదిపై నిర్మించిన వంతెనపై నుంచి కిందపడింది. ఖర్గోన్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దర్భంగాలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, 25 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చికిత్సతోపాటు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఇండోర్ వైపు బస్సు వెళుతోంది. ఖార్గోన్‌లోని ఖర్గోన్ టెమ్లా రోడ్డులోని దాసంగా సమీపంలోకి బస్సు చేరుకోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన బస్సు వంతెనపై నుంచి కిందకు పడిపోయింది. పెద్ద శబ్ధం విని బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఘటనా స్థలానికి పరుగులు తీశారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ప్రయత్నించి ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్స్‌ను పంపించి పోలీసు బృందాన్ని కూడా పంపించారు. పోలీసులు, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకునేలోపే, గ్రామస్థులు చాలా మంది క్షతగాత్రులను ట్రాక్టర్ ట్రాలీలో సమీప ఆసుపత్రికి తరలించారు.

Also Read: Aishwarya Thatikonda: అమెరికాలోని మాల్‌లో కాల్పులు.. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతి మృతి

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా 14 మంది మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయమై ఖర్గోన్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ధరమ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 14 మంది మరణించారని, 20 మంది గాయపడ్డారని చెప్పారు. ఇండోర్ వైపు వెళ్తున్న బస్సులో దాదాపు 50 మంది ఉన్నారని చెప్పారు. అనంతరం చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 15కి చేరింది. గాయపడిన వారి సంఖ్య కూడా 25కి చేరింది.

ఖార్గోన్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, ఇతర క్షతగాత్రులకు రూ.25 వేలు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులందరినీ బయటకు తీశారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే అతి వేగమే దీనికి కారణమని భావిస్తున్నారు.