Madhya Pradesh : ఎంపీలో మామాజీ కా కమాల్

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమేజ్ తన సొంత పార్టీ బిజెపిలోనే మసకబారినట్టుగా కనిపించింది

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 04:02 PM IST

డా. ప్రసాదమూర్తి

మధ్యప్రదేశ్లో మీడియా ఎగ్జిట్ పోల్స్ చాలావరకు భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన పరిణామాలు వస్తాయని చెప్పాయి. కానీ అక్కడ గ్రౌండ్లో జరిగిన పరిణామాలు చూస్తే కాంగ్రెస్ విజయం ఖాయమని చాలామంది ఊహించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమేజ్ తన సొంత పార్టీ బిజెపిలోనే మసకబారినట్టుగా కనిపించింది. ఈసారి ప్రచారంలో కానీ, అభ్యర్థులను ప్రకటించిన తీరులో గాని బిజెపి అధిష్టానం ఎక్కడా ఆయన పేరు ఎత్తలేదు.

బిజెపి అధికార ట్విట్టర్ పేజీలో ప్రచురించిన పోస్టర్లలో అంతా ప్రధాని మోడీ ప్రచారమే గాని చౌహాన్ బొమ్మ ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు అభ్యర్థుల జాబితాలు విడుదల చేసినప్పుడు మూడో జాబితాలో గానీ చౌహాన్ పేరు కనిపించలేదు. బిజెపి అగ్రనాయకత్వం అధికారంలో ఉన్న తమ పార్టీ ముఖ్యమంత్రినే ఈ విధంగా వెనక పెట్టిన కారణంగా అక్కడ బిజెపికి ఓటమి భయం పట్టుకుందని ప్రతిపక్షాలు సహజంగానే ప్రచారం సాగించాయి. ఇదంతా చూసి అధికార పార్టీ బలహీన పడిపోయిందని, తమ విజయం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు అత్యంత ధీమాగా ఉన్నారు.

ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రధాని గాని, అమిత్ షా గాని ఎక్కడా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రస్తావించలేదు. అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని కూడా పార్టీ ప్రకటించలేదు. ప్రచారం మొదటినుంచి చౌహాన్ అగ్ర నాయకులతో పాటు వేదికలు పంచుకున్నా, లో ప్రొఫైల్ నే కొనసాగించారు. ఇప్పటికే ఆయన నాలుగో సారి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నాడు. ఆయన పట్ల ఎంతో వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని బిజెపి అధిష్టానం భావించింది. అందుకే బిజెపి ఎంపీలో నలుగురు పార్లమెంటు సభ్యుల్ని రంగంలోకి దింపింది. మంత్రులని కూడా రంగంలోకి దింపింది.

చౌహాన్ మీద ఏమాత్రం నమ్మకం లేదని, బిజెపి అధినాయకత్వం అందుకే ఈ విధంగా తమ దారిలో తాము ప్రచారం సాగించుకుంటుందని వివిధ మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు భావించారు. అందుకే అక్కడ కాంగ్రెస్ విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా భరోసాతో ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని, అది ఇప్పుడు మరింత పెరిగిందనే ఫలితాలలో రుజువైంది. ప్రచారం సమయంలో మనం గుర్తు చేసుకుంటే మధ్యప్రదేశ్లో బిజెపి ప్రచారం అంతా ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ చుట్టూ తిరిగింది. మధ్యప్రదేశ్ కా దిల్ మే మోడీ హై.. మోడీ కా మన్ మే ఎంపీ హై అంటూ సింగిల్ నినాదంతో బిజెపి నాయకత్వం మొత్తం ప్రచారం చేసింది.

సొంత పార్టీ నుంచి ఇంత అవమానకరమైన వాతావరణం తన చుట్టూ పోగైనప్పటికీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన దారిన తాను ప్రచారం చేసుకుంటూ వెళ్లారు. ప్రధాని 30 సభలలో ప్రసంగిస్తే ఆయన దాదాపు రాష్ట్రమంతా తిరిగి 160 సభలలో తన ప్రచారాన్ని సాగించారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తమ ఇతర మిత్ర పక్షాలతోనే ఒత్తు పెట్టుకోకపోవడం చౌహాన్ కి బాగా కలిసి వచ్చింది. ఛత్తీస్గఢ్లో మాదిరిగా మధ్యప్రదేశ్లో కూడా గిరిజన వోటర్లు గణనీయంగా ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాల్లో దేశంలోని గిరిజనుల సంఖ్యలో 31 శాతం మంది ఉంటారని అంచనా. ఎంపీలో కూడా కాంగ్రెస్ కి గిరిజనులు ఎదురు తిరిగారని అక్కడ పార్టీ గెలుపొందిన ఎస్టీ స్థానాలను చూస్తే అర్థమవుతుంది.

తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఉదాసీనంగా ఉండడం, కమల్నాథ్ పార్ట్ టైం ప్రచారకుడుగా మాత్రమే ఉన్నారని వార్త కూడా వినవస్తోంది. వీటికి తోడు అక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 6000 నుండి 12వేలకు పెంచడం, అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించడం ఎంపీలో బలమైన ప్రభావాన్ని చూపించాయని విశ్లేషకుల అంచనా. ఇక్కడ సంయుక్త కిసాన్ మోర్చా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా అశేష సంఖ్యలో రైతులు బిజెపి పక్షాన నిలిచినట్లు తెలుస్తోంది. దీనికి కారణం కిసాన్ సమ్మాన్ నిధి ని రెట్టింపు చేయడం ఒకటిగా భావించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

సంయుక్త కిసాన్ మోర్చాని ఎందుకో రైతులు నమ్మలేదు. అది కాంగ్రెస్ పార్టీకి బీ టీం అని రైతులు భావించారు. అటు ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో లాగే మధ్యప్రదేశ్లో కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో బిజెపి అత్యధిక స్థానాలు సంపాదించుకుంది. ఇవన్నీ ఎలా ఉన్నా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ని అందరూ మామాజీ అంటారు. అక్కడ ప్రజలు మామాజీ పట్ల మమకారాన్ని పోగొట్టుకోలేదు, సరి కదా మరింతగా పెంచుకున్నారని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థమవుతుంది. రాష్ట్రంలో 230 స్థానాలకు గాను 163 స్థానాలను బిజెపికి కట్టబెట్టి ప్రజలు మామాజీ కి మరోసారి పట్టం కట్టారు.

బిజెపి అగ్రనాయకత్వంలో తనకు ఎలాంటి స్థానం ఉన్నప్పటికీ, ప్రజలలో తన స్థానం పదిలమని చౌహాన్ నిరూపించుకున్నారు. అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 66 స్థానాలు మాత్రమే ఇక్కడ దక్కాయి. ఇతరులకు ఒక స్థానం దక్కింది. మొత్తం మీద ఎంపీలో మామాజీ కా కమల్ బాగా పనిచేసినట్టు అర్థమవుతుంది. ఇక ఇప్పుడైనా బిజెపి అధిష్టానం చౌహాన్ అంటే ఏమిటో గుర్తిస్తుందని అనుకోవచ్చు.

Read Also : BRS : కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ ఏమైనా మారుతున్నారా..?

Follow us