ఉత్తరప్రదేశ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటలుగా భారీగా కురుస్తున్న వర్షాలతో లక్నో అతలాకుతలం అవుతోంది. దీంతో పలు ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. దిల్ కుషా ప్రాంతంలో ఓ ఇల్లు కూలి 9 మంది మరణించారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కాగా శుక్రవారం ఉదయం లక్నో కమిషనర్ రోషన్ జాకబ్ నగరంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. స్వయంగా నీటిలోకి దిగిన IAS అధికారి రోషన్…మోకాళ్ల నిండా నీళ్లు…ఓ చేత్తో సపోర్టు…మరో చేతిలో గొడుగు పట్టుకుని లోతట్టు ప్రాంతాలన్నింటిని పరిశీలించారు. జాంకీపురం, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, రివర్ ఫ్రంట్ కాలనీ మొదలైన ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల జాగ్రత్త వహించాలని…అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోడ కూలి మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేసిన సీఎం యోగి… మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.