Lok Sabha MPs : ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఈ తరుణంలో ఏడుగురు ఎంపీలు కీలకంగా మారారు. ఎందుకంటే వారంతా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఈరోజు లోక్‌సభలో జరిగే ఓటింగ్‌లో ఈ ఏడుగురు ఎంపీలు ముఖ్యంగా మారబోతున్నారు. ఇంకా ప్రమాణ స్వీకారం చేయని కారణంగా.. ఇవాళ ఈ ఏడుగురు ఎంపీలకు ఓటు వేసే అవకాశం దక్కదు. ఈ విధంగా ఓటింగ్ అవకాశాన్ని కోల్పోతున్న ఎంపీల జాబితాలో శశిథరూర్, శత్రుఘ్న సిన్హా లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్పీకర్ ఎన్నికలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతున్న ఏడుగురు ఎంపీల్లో.. ఐదుగురు ఇండియా కూటమి ఎంపీలు, ఇద్దరు స్వతంత్ర ఎంపీలు(Lok Sabha MPs) ఉన్నారు. వీరు ఓటు వేయకపోవడంతో ఏం జరగబోతోంది ? స్పీకర్ ఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుంది ? అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతం లోక్‌సభలో అధికార ఎన్డీయే కూటమికి 293 సీట్ల బలం ఉంది. విపక్ష ఇండియా కూటమి వద్ద మొత్తం 232 సీట్లు ఉన్నాయి. అయితే ఐదుగురు ఇండియా కూటమి ఎంపీలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో దాని సంఖ్యా బలం 227 కు తగ్గిపోయింది. ఈ లెక్కన లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు మెజార్టీ మార్క్ 269గా నిలుస్తుంది. మరోవైపు వైఎస్సార్ సీపికి చెందిన నలుగురు ఎంపీల మద్దతు బీజేపీకే లభించనుంది. అకాలీదళ్ ఎంపీలు కూడా బీజేపీకే మద్దతు పలికే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇవాళ స్పీకర్ ఎన్నిక కోసం దాదాపు 300 ఎంపీల బలాన్ని కూడగట్టి సత్తాచాటుకోవాలనే దిశగా బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీల మద్దతు కోసం మంతనాలు జరుపుతోంది. కాగా, స్పీకర్ పదవి కోసం అధికార ఎన్డీయే కూటమి తరఫున రాజస్థాన్ ఎంపీ ఓం బిర్లా, విపక్ష ఇండియా కూటమి తరఫున కేరళ ఎంపీ కే. సురేశ్ పోటీ చేస్తున్నారు.