మరో మూడు రోజుల్లో మే నెల ముగియనుంది. కొత్త నెల జూన్ ప్రారంభమయ్యే ముందు, బ్యాంక్ పనులపై ముందస్తు ప్రణాళిక వేసుకోవాలంటే సెలవుల (Bank Holidays) జాబితా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే జూన్ (June Bank Holidays) 2025లో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా బక్రీద్ వంటి జాతీయ పండుగలతో పాటు, కొన్ని ప్రాంతీయ పండుగలు, రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒక్కలా వర్తించవు. ప్రాంతీయ అంశాలపై ఆధారపడి భిన్నంగా ఉండొచ్చు. అయినప్పటికీ, జూన్ 7న జరిగే బక్రీద్ పండుగ మాత్రం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సాధారణ సెలవుగా ప్రకటించబడింది.
ప్రధాన బ్యాంక్ సెలవులు – తేదీల వివరాలు
జూన్ 6న కేరళలో బక్రీద్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. అదే పండుగ జూన్ 7న ఇతర రాష్ట్రాల్లో జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులకు సెలవుగా ఉంటుంది. జూన్ 11న సిక్కిం, మేఘాలయలో గురు కబీర్ జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడతాయి. జూన్ 27న ఒడిశా, మణిపూర్‌లో రథయాత్ర సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూన్ 30న మిజోరాంలో ‘రెమ్నా ని’ (శాంతి దినోత్సవం) సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. దీనితో పాటు జూన్ 1, 8, 15, 22, 29 (ఆదివారాలు), జూన్ 14 (రెండో శనివారం), జూన్ 28 (నాలుగో శనివారం) రోజులు వారాంతపు సెలవులుగా పాటిస్తారు.
బ్యాంకులు సెలవు రోజుల్లో మూసి ఉన్నప్పటికీ, మీ ఆర్థిక కార్యకలాపాలు అంతరాయం లేకుండా సాగించవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా యాప్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులు ఎప్పటిలానే పనిచేస్తాయి. నగదు అవసరం ఉన్నప్పుడు ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – స్థానిక, మతపరమైన వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సెలవుల జాబితాను ఖరారు చేస్తుంది. కాబట్టి, మీ బ్యాంక్ పనులకు ఆటంకం లేకుండా ముందుగానే ఈ సెలవుల జాబితా ఆధారంగా ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం.