LIC: నేటి నుంచే ఎల్ఐసీ ‘ఐపీఓ’

స్టాక్ మార్కెట్ గురించి, ఐపీఓ గురించి తెలియనివాళ్లలో కూడా ఎల్ఐసీ ఐపీఓ ఆసక్తిని రేకెత్తించింది.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:38 AM IST

స్టాక్ మార్కెట్ గురించి, ఐపీఓ గురించి తెలియనివాళ్లలో కూడా ఎల్ఐసీ ఐపీఓ ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే కొన్ని కోట్లమంది జీవితాల్లో ఎల్ఐసీ ఇప్పటికే భాగమైంది. అలాంటి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇవాల్టి (04-05-2022) నుంచే ఇష్యూకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు ఎవరైనా సరే.. ఈనెల 9వతేదీ వరకు షేర్ల కోసం అప్లై చేసుకోవచ్చు. యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగానికే బీభత్సమైన రియాక్షన్ రావడంతో ఈ ఐపీఓ హిట్ అవుతుందంటున్నాయి మార్కెట్ వర్గాలు. అందుకే పాలసీదార్లు, రిటైల్ మదుపర్లు, ఇక ఫస్ట్ టైమ్ పబ్లిక్ ఇష్యూకు అప్లికేషన్ పెడుతున్నవారిలోనూ ఎల్ఐసీ ఐపీఓ ఆసక్తిని పెంచింది. ఈ పబ్లిక్ ఇష్యూ ధరలను గమనిస్తే.. రూ.902-949 గా ఉంది. ఇందులో పాలసీదార్లకు రూ.60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్ ఇస్తామని సంస్థ ముందే ప్రకటించింది.

ఎల్ఐసీకి దాదాపు 30 కోట్లమంది పాలసీదారులు ఉన్నారు. 13 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. మార్కెట్ లో ఉన్న మొత్తం బీమా ప్రీమియంలో సుమారు 64 శాతం వాటా దీనిదే. దేశీయ బీమా రంగం 2019-2020లో రూ.5.7 లక్షల కోట్ల ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఎల్ఐసీ వాటా రూ.3.8 లక్షల కోట్లు. ఇక ఈ ఐపీఓకు దరఖాస్తు చేసేవారు ఎవరైనా సరే.. కచ్చితంగా దీర్ఘకాలానికి చేస్తేనే మంచిదంటున్నారు నిపుణులు. మళ్లీ ఏడాది తరువాత కూడా వాటాల విక్రయం ఉండొచ్చని అది గమనించాలని చెబుతున్నారు. ఎల్ఐసీకి ఉన్న పేరు, సంస్థ ఆస్తుల వల్ల ప్రజలు ఇప్పటికే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుండడం వల్ల ఐపీఓకు ఎక్కువమంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది.