LIC : ఎల్ఐసీ షేర్లు కొంటే లాభమా? నష్టమా? నిపుణులు ఏమంటున్నారు?

ఎల్ఐసీ సంస్థ ఐపీఓకు రానుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి దాని షేర్లను కొనాలని చాలామంది భావిస్తున్నారు. కానీ దానివల్ల లాభమా, నష్టమా అనేది చాలామందికి అర్థం కావడం లేదు.

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 11:14 AM IST

ఎల్ఐసీ సంస్థ ఐపీఓకు రానుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి దాని షేర్లను కొనాలని చాలామంది భావిస్తున్నారు. కానీ దానివల్ల లాభమా, నష్టమా అనేది చాలామందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే సంస్థ ఆర్థిక పరిస్థితి చూస్తే పరిపుష్టంగా ఉంది. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే.. ప్రైవేటు సంస్థల నుంచి ఏమేరకు పోటీని తట్టుకుంటుందా అన్న నిపుణుల అనుమానాలు ఆందోళనను పెంచుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసీ షేర్లను కొనడం వల్ల ఆర్థికంగా లాభమో, నష్టమో అన్నదానిపై సందిగ్దత నెలకొంది.

ఎల్ఐసీ షేర్లను కొనే విషయంలో కొన్ని విషయాలను గమనించాలి. ఈ సంస్థకు ఉన్న పాలసీదారుల్లో దాదాపు 6 కోట్లమంది తమ పాలసీలను పాన్ తో లింక్ చేసుకున్నారు. ఇక ఈ సంస్థ రూ.21 వేల కోట్లను సమీకరించడానికి ఐపీఓకు వస్తుంది. ఎక్కువమంది ఈ షేర్లను కొనాలనే అంటున్నారు. కాకపోతే 65 ఏళ్లుగా బీమా రంగంలో నెంబర్ వన్ గా ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ సంప్రదాయ పద్దతుల్లోనే పాలసీలను జారిచేస్తోంది.

దేశంలోని బీమా రంగంలో ఎల్ఐసీకి 61.6 శాతం వాటా ఉంది. వ్యక్తిగత పాలసీ సెక్షన్ లో 71.8 శాతం, గ్రూప్ పాలసీల విభాగంలో 88.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పటివరకు కంపెనీ ప్రతిష్టకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అందుకే భవిష్యత్ లో దీనికి తిరుగులేదంటున్నారు. కానీ ఇన్వెస్టర్ల పరంగా చూస్తే.. ప్రైవేటు కంపెనీల నుంచి ఎల్ఐసీకి పోటి ఉంది. అందుకే దాని మార్కెట్ వాటా క్రమంగా తగ్గిపోతోంది.

ఎల్ఐసీ సంస్థ వార్షిక వృద్ధి రేటు కూడా ప్రైవేట కంపెనీల కంటే తక్కువ ఉంది. పైగా ఎల్ఐసీ పాలసీల్లో ఇప్పటికీ 90 శాతం పాలసీలు ఏజెంట్ల ద్వారానే ఇస్తున్నారు. రెన్యూవల్ ప్రీమియమ్స్ లో కేవలం 36 శాతమే డిజిటల్ మార్గంలో వస్తున్నాయి. అంటే భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి ఉంటే.. పాలసీల జారీ అనేది చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. అందుకే ఐపీవోలో పాల్గొనే ముందు ఇలాంటి అంశాలను గమనించాలంటున్నారు.