Site icon HashtagU Telugu

Lemon Rates : నిమ్మకాయల రేటు ఇంతలా పెరగడానికి అదే కారణమా?

Lemon Copy

Lemon Copy

అసలే వేసవి మంటలతో ఒళ్లంతా చిటపటలు. కాసిన్ని నిమ్మకాయ నీళ్లు తాగితే దాహం తీరుతుందని.. ఒంటికి సత్తువ వస్తుందని.. వేడి తగ్గుతుందని అనుకుంటారు. అలాగని నిమ్మకాయలు కొనడానికి ప్రయత్నించారో.. అంతే. ఎందుకంటే వాటి రేట్లకు ఆపిల్ కాయలు వచ్చేలా ఉంది పరిస్థితి. పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగడం, గ్యాస్ రేట్లు పెరగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే వేసవిలో నిమ్మకాయల ధరలు చుక్కలనంటుతున్నాయి.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని రాజ్ కోట్ లోనే కేజీ నిమ్మకాయల ధర రూ.200 పలుకుతోంది. వేసవి వల్ల డిమాండ్ పెరిగినా దానికి తగ్గట్టుగా సప్లయ్ లేదు. అందుకే రేట్లలో ఇంత తేడా వచ్చింది. కరోనా తరువాత ఆరోగ్యంపై స్పృహ పెరగడంతో చాలా మంది నిమ్మకాయ నీళ్లు తాగడానికి అలవాటు పడ్డారు. ఇందులో విటమిన్ సీ ఎక్కువుంటుంది. జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. అందుకే వేసవిలో దీనికి మరింత డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పుడింతగా రేటు పెరగడంతో అది ఏకంగా బడ్జెట్ పైనే ప్రభావం చూపిస్తోంది.

మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ ధర దాని సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 అయినా పలుకుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో పరిస్థితిని చూస్తే.. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కేజీ నిమ్మ రేటు కిందటి నెలలో రూ.60 అయితే.. ఇప్పుడు రూ.90-100 పలుకుతోంది. రెండో రకం క్వాలిటీ అయితే రూ.80-90 ఉంది. కిందటి సీజన్ లో నిమ్మ ధరలు రూ.50-60 ఉండేది. కానీ ఇప్పుడు రూ.200 దాటిపోయాయి.

మార్చి, ఏప్రిల్ లోనే ఈ స్థాయిలో రేట్లు ఉంటే.. ఇక మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశముండొచ్చంటున్నాయి మార్కెట్ వర్గాలు. వారానికి కిలో నిమ్మకాయలు వాడే కుటుంబాలు కూడా ఇప్పుడు పావు కిలో లేదా అరకిలోకే పరిమితమవుతున్నాయి. కొన్ని చోట్ల నిమ్మకాయకన్నా చిన్నసైజు ఆపిల్ పండే చవగ్గా వస్తుండడంతో.. ఏమి రోజులొచ్చాయిరా బాబు అని వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version