Rahul Gandhi: ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశీ భాషలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లిషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయి అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భవిష్యత్‌లో మన దేశంలో ఇంగ్లిషు మాట్లాడటం ఒక సిగ్గుగా పరిగణించబడే రోజులు వస్తాయని అమిత్ షా స్పష్టం చేశారు. భారతదేశ సంస్కృతిని, ధర్మాన్ని, అంతర్గత ఆత్మను అర్థం చేసుకోవడానికి విదేశీ భాషలు సరిపోవని అభిప్రాయపడ్డారు. భారతీయతను పూర్తిగా అనుభవించేందుకు, దేశ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు మాతృభాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షా పునరుద్ఘాటించారు. విదేశీ భాషల్లో అభివ్యక్తి సాధ్యమైనా, వాటితో సంపూర్ణ భారతీయతను వ్యక్తపరచడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
అయితే ఇది సాధించడం సులభం కాదన్నది తనకు తెలుసని తెలిపారు. అయినా మన సమాజం ఈ మార్గంలో ముందుకు సాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు. ఆంగ్ల భాష విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని, ఉపాధిని కల్పించగల శక్తి ఉన్న భాషగా రాహుల్ అభివర్ణించారు. భారతదేశంలోని ప్రతి భాషలో ఆత్మ, సంస్కృతి, జ్ఞానం నిక్షిప్తంగా ఉన్నాయని, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఆంగ్ల భాషను నిర్లక్ష్యం చేయలేమని స్పష్టం చేశారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పేద విద్యార్థులు ఇంగ్లిషు భాష నేర్చుకుని సమానత్వాన్ని సాధించడం ఇష్టం ఉండదు. అందుకే వారికి విద్యను దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యలో భాషలకు సంబంధించి సమతుల్యత అవసరమని, మాతృభాషను ఆదరించడమే కాకుండా, భవిష్యత్‌ను నిర్మించేందుకు ఆంగ్ల భాష కూడా తప్పనిసరిగా ఉందని ఆయన హితవు పలికారు. ఈ భాషా చర్చపై దేశవ్యాప్తంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సంస్కృతి పరిరక్షణకు మాతృభాషల పట్ల మక్కువ, మరోవైపు ప్రపంచ మంత్రములో పోటీకి ఆంగ్ల భాష ప్రాముఖ్యం ఈ రెండు అంశాల మధ్య సమతౌల్యాన్ని ఎలా ఏర్పరిచేది అనేది కీలకంగా మారింది.
Read Also: Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం