Leaked NEET Paper : దేశంలోని ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ (నీట్)పై దుమారం రేగుతోంది. బిహార్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) కీలక వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు కూడా చేసింది. అదుపులోకి తీసుకున్న నీట్ అభ్యర్థి 22 ఏళ్ల అనురాగ్ యాదవ్‌ను పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మా మేనమామ సికందర్ ప్రసాద్ యాదవెందు నా కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. పేపర్ లీక్ మాఫియా నుంచి అతడు నీట్ ప్రశ్నపత్రం కొని.. నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. పరీక్షకు ముందు రోజు రాత్రే నా చేతికి నీట్ ప్రశ్నపత్రం అందింది. దానితో పాటు ఆ ప్రశ్నల ఆన్సర్స్‌తో కూడిన బుక్‌లెట్‌ను నాకు ఇచ్చారు. ఆ ప్రశ్నపత్రం.. పరీక్షలో నాకు వచ్చిన క్వశ్చన్ పేపర్ రెండూ సేమ్ టు సేమ్ ఉన్నాయి’’ అని అనురాగ్ యాదవ్ పోలీసులకు వాంగ్మూలం(Leaked NEET Paper) ఇచ్చాడు. ఈమేరకు ఇచ్చిన స్టేట్‌మెంట్ కాపీపై అతడు సంతకం కూడా చేశాడు. ఈ వివరాలతో జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రచురితం అయ్యాయి. అనురాగ్ యాదవ్ మేనమామ సికందర్ ప్రసాద్ యాదవెందు బిహార్‌లోని దానాపూర్ నగర పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేసే వాడని విచారణలో తేలింది.
We’re now on WhatsApp. Click to Join
బిహార్ రాష్ట్రంలో నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు బయటికి వస్తుండటంపై తాజాగా కేంద్ర విద్యాశాఖ కూడా స్పందించింది. ఆ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని బిహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి కేంద్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అయితే గుజరాత్‌లో చోటుచేసుకున్న నీట్ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారంపై ఎలాంటి విషయాలూ ఇంకా బయటికి రావడం లేదు. ఈ వ్యవహారంపై దాఖలైన దాదాపు డజనుకుపైగా పిటిషన్లపై వచ్చే నెల 8న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జులై 6 నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది.
Also Read : ED Search : పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
తాజాగా యూజీసీ – నెట్ పరీక్షను కేంద్ర విద్యాశాఖ రద్దు చేసింది. ఆ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని కేంద్ర సైబర్ క్రైమ్ విభాగం నుంచి సమాచారం అందినందు వల్లే రద్దు చేశామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో జూన్ 18న నెట్ పరీక్షను రాసిన అభ్యర్థులంతా షాక్‌కు గురయ్యారు. వారందరికీ మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. నెట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో నీట్ పరీక్ష వ్యవహారంలో ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. సుప్రీంకోర్టు మాత్రం నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆపడానికి, షెడ్యూల్‌ను మార్చడానికి అనుమతి ఇవ్వబోమని తేల్చి చెబుతోంది. నీట్ పరీక్ష పేపర్ల లీక్ వ్యవహారంతో ముడిపడిన కొత్త అంశాలతో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో వేచిచూడాలి.