Site icon HashtagU Telugu

Punjab Election Results 2022: పంజాబ్ పెద్ద‌ల‌కు ప‌రాభ‌వం..!

Punjab Election Results 2022

Punjab Election Results 2022

పంజాబ్ ఎన్నిక‌ల్లో ఈసారి అక్క‌డి ఓట‌ర్లు విల‌క్ష‌ణ తీర్పును ఇచ్చారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్య‌ర్ధిని మాత్రం గెలిపించిన పంజాబ్ ప్ర‌జ‌లు, మిగ‌తా పార్టీ సీఎం అభ్య‌ర్ధుల‌ను, రాజ‌కీయాల్లో త‌ల‌పండిన ఉద్ధండుల‌ను ఓడించారు. ఈ క్ర‌మంలో సీఎం చ‌న్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. పంజాబ్ సీఎం చ‌న్నీ పై కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. అయితే పంజాబ్‌లో ఆప్ ప్ర‌భంజ‌నం దెబ్బ‌కి చ‌న్నీ చాప చుట్టేశారు.

ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ త‌రుపున‌ అన్నీ తానై నడిపించిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా ఘోరంగా ప‌రాజ‌యం పొందారు. అమృత్‌సర్‌ ఈస్ట్ నుండి పోటీ చేసిన సిద్ధూ పై జీవన్‌జోత్‌ కౌటర్‌ లీడ్‌లో ఉన్నారు. ఇక పంజాబ్‌లో చన్నీ కంటే ముందు, అక్క‌డ ముఖ్య‌మంత్రిగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ బలమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఈసారి ఆప్ అభ్య‌ర్ధి అజిత్ పాల్ సింగ్ చేతిలో దాదాపు 19 వేల ఓట్ల తేడాతో ఓడిపోవ‌డం, అక్క‌డి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

పంజాబ్‌లో గ‌తంలో ఐదు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ కూడా ఈసారి ఓడిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పంజాబ్‌లో లాంబీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ప్రకాశ్ సింగ్ బాద‌ల్ పై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్ధి గుర్మీత్‌ గుబియాన్‌ లీడ్‌లో ఉన్నారు. అలాగే అకాలీదళ్ సీఎం అభ్య‌ర్ధి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడు సుక్‌వీర్‌, ఆప్ అభ్యర్థి జగదీప్‌ కంభోజ్ చేతిలో ఓట‌మి పాల‌య్యాడు.

ఇక ముఖ్యంగా సీఎం చన్నీమంత్రివ‌ర్గ సహచరుల్లో ఉన్న‌ 12 మంది వెనుకంజ‌లో ఉన్నారు. అలాగే స్పీకర్‌ కూడా ఓటమి త‌ప్పేలా లేద‌ని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ఈసారి పంజాబ్ ఓట‌ర్లు ఇచ్చిన విల‌క్ష‌ణ తీర్పుకు, పంజాబ్ పెద్ద‌లకు ప‌రాభ‌వం త‌ప్ప‌లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఇక పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండ‌గా, ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో అధిక్యంలో కొన‌సాగుతుండ‌గా, కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఇక బీజేపీతో స‌హా ఇత‌ర పార్టీలు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అవ‌డంతో పంజాబ్‌లో తొలిసారి ఆప్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతుండ‌డం విశేషం.