Lakshmi Narayana: కాంగ్రెస్ లోకి లక్ష్మీ నారాయణ? రాయపూర్ ప్లీనరీ ఎఫెక్ట్!

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీవీ లక్ష్మీనారాయణ సిద్ధం అయినట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుంది.

  • Written By:
  • Updated On - February 27, 2023 / 12:58 PM IST

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వీవీ లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) సిద్ధం అయినట్టు ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతుంది. రాయపుర్ ప్లీనరీ వేదికగా హోదా ఇస్తామని కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఆ మరుక్షణమే లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని మరో సారి తేల్చి చెప్పారు. తన ఆలోచనలకు, ఆశయాలను అనుగుణంగా ఉన్న పార్టీ తరపున ఎంపీగా పోటీ చే స్తానని స్పష్టం చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశాలను ఎన్నికల ప్రణాళికలో పెట్టిన పార్టీలోనే తాను చేరుతానని స్పష్టం చేసారు. ఇవే అంశాలను ప్లీనరీ వేదికగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకే ఆయన కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తుంది. టీడీపీలో చేరడానికి అక్కడ ఛాన్స్ లేదు.

అక్కడ బాలయ్య చిన్న అల్లుడు ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక జనసేన నుంచి బయటకు వచ్చిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. ఇక వైసీపీ, బీజేపీ ఆయనకు ఆప్షన్ ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం గా భావిస్తున్న పార్టీలుగా ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్నాయి. అందుకే లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) కు ఉన్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిన లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల కోసం ముందు నుంచే వ్యూహాత్మకంగా విశాఖ అంశాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. స్టీల్ ప్లాంట్ అంశం పైన న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీకి సిద్దమని చెబుతున్నారు.అయితే ఆయన పోరాటాలకు అనుగుణంగా ప్లీనరీలో తీర్మానాలు చేసిన కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం బెటర్ అని ఆలోచనకు ఆయన వచ్చారని తెలుస్తుంది.

ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం పైన చర్చ సాగుతోంది. సుప్రీంకోర్టులో రాజధాని కేసు విచారణలో ఉంది. వచ్చే నెల 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ నుంచి పాలన పైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఉగాది నుంచి సీఎం తన క్యాంపు కార్యాలయం విశాఖ కేంద్రంగా ప్రారంభించేందుకు సిద్దమయ్యారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) కీలక వ్యాఖ్యలు చేసారు. శాసనసభలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారని గుర్తు చేసారు. దానిని మార్చటం సరి కాదన్నారు. కొన్ని భవనాలు,.కార్యాలయాలు పెట్టినంత మాత్రాన ఆ ప్రాంతం డెవలప్ కాదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అన్ని జిల్లాలను సమకోణంతో చూడాలని సూచించారు. దీని ద్వారా అమరావతి రాజధానిగా కొనసాగించాలని లక్ష్మీనారాయణ స్పష్టం చేసారు.

ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే సత్తా బ్యాంకులకే ఉందని లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎక్కడ స్కాం జరిగినా దానిని ప్రతీ ఉద్యోగి కేసు స్టడిగా తీసుకొని జాగ్రత్త పడాలని సూచించారు. తనకు ఉన్న అవగాహన మేరకు రెండు వేల రూపాయల నోట్లు బయట కనిపించటం లేదన్నారు. కొంత మంది నాయకులు నల్లధనంగా దాచుకోవటానికే ఉపయోగపడుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. పాత నోట్ల రద్దు ఉద్దేశం నెరవేరలేదన్నారు. రూ 2 వేల నోట్లు రద్దు చేయటం ఉత్తమని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు కొత్తగా భాద్యతలు తీసుకున్న గవర్నర్ కు తెలియచేశారు. అంటే, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ మీద ఆయన గళం విప్పారు. ఇదే ఒరవడి కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ (Lakshmi Narayana) సిద్ధం అయినట్టు అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. కానీ ఆయన ఇంకా ఫైనల్ నిర్ణయం కు రాలేకపోతున్నారు.

Also Read:  Thunderbolt: థండర్ బోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అదుర్స్ 110 కి.మీ రేంజ్