రాజస్థాన్ రాజకీయాలను ఓ లేడీ డాక్టర్ సూసైడ్ కేసు కుదిపేస్తోంది. దౌసా జిల్లాలో డాక్టర్ అర్చనా శర్మ, ఆమె భర్తతో కలిసి లాల్ సోట్ లో ఓ హాస్పటల్ ను నడుపుతున్నారు. ఓ గర్భిణీకి సిజేరియన్ చేయాల్సి వచ్చింది. దీంతో అర్చనాశర్మ ఆ కేసు టేకప్ చేశారు. కానీ ఆ గర్భిణికీ ఆపరేషన్ చేస్తుండగా ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగారు
పోలీసులు కూడా అర్చనాశర్మపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ గర్భిణీ మృతితో తనకు సంబంధం లేకపోయినా.. ఆ ఘటనలో తన నిర్లక్ష్యం లేకపోయినా సరే.. తనపై అక్రమంగా కేసు ఫైల్ చేశారని అర్చన మనస్తాపానికి గురయ్యారు. ఆసుపత్రి పైనే ఉన్న తన నివాసంలో ఆమె ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆమె చనిపోయే ముందు ఓ సూసైడ్ లెటర్ కూడా రాశారు. ఈ కేసులో తన తప్పేమీ లేదని.. తాను నిర్దోషినని చెప్పడానికి ఇంతకన్నా మరో మార్గం లేదంటూ దానికి తన చావే సాక్ష్యమంటూ రాశారు. అమాయకులైన డాక్టర్లను వేధించవద్దని ఆ లెటర్ లో కోరారు.
అర్చనా శర్మ సూసైడ్ తో జిల్లా వ్యాప్తంగా డాక్టర్లలో ఆగ్రహావేశాలు ఎక్కువయ్యాయి. వెంటనే వైద్యసేవలను ఆపేశారు. ఉన్నతస్థాయి విచారణ జరపాలన్నారు. అయినా విధుల నిర్వహణలో ఉన్నప్పుడు వైద్యులపై సెక్షన్ 302 కింద కేసు ఫైల్ చేయద్దని సుప్రీంకోర్టే చెప్పిందని.. అలాంటప్పుడు ఆ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అర్చనతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనోవేదనకు లోనవ్వడం వల్లే ఆమె ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ కేసులో అర్చన కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ దృష్టికి వెళ్లింది. దీంతో రోగుల ప్రాణ రక్షణలో డాక్టర్ల సేవలు చాలా కీలకమని.. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఇప్పుడీ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తు్న్నాయి. ఇది రాజస్థాన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
