లేహ్, లద్ధాఖ్: (Ladakh Violence)- లద్ధాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా మరియు ఆరవ షెడ్యూల్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ లేహ్‌లో జరిగిన భారీ నిరసనలు తీవ్రమైన హింసకు దారి తీశాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలో నలుగురు మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో, గత రెండు వారాలుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం సాయంత్రం తన దీక్షను విరమించారు.
బుధవారం ఉదయం లేహ్ నగరం పూర్తిగా షట్‌డౌన్‍కు దారి తీసింది. శతాధికంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, వాహనాలు తగలబెట్టారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పొగలు, మంటలు కనిపించాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలో కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా నిరసనలు ఉధృతంగా కొనసాగినట్లు అధికారులు తెలిపారు. BNSS చట్టంలోని సెక్షన్ 163 కింద ఐదుగురికిపైగా ఒకచోట కూడకూడదని ఆంక్షలు విధించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, కౌన్సిలర్ ఫున్సోగ్ స్టాంజిన్ త్సేపాగ్‌ను మంగళవారం దీక్షా శిబిరంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. ఆయనపై “ఉద్రేకపరిచే వ్యాఖ్యలు” చేశారని కేసు నమోదైంది.
ఇక కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ, ఈ నిరసనలను ముందుగానే పక్కాగా ప్రణాళికతో చేపట్టిన కుట్రగా అభివర్ణించాయి. వాంగ్‌చుక్ లాంటి వ్యక్తులు లద్ధాఖ్ యువతను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించాయి. అక్టోబర్ 6న హైపవర్ కమిటీ సమావేశం ఉండబోతున్న సమయంలో ఇలాంటి హింస కల్లోలం సృష్టించడం అనేది కావాలనే చేసిన చర్యగా అభిప్రాయపడ్డాయి.
