Site icon HashtagU Telugu

KTR About Hindi : హిందీ భాష పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Ktr Hindi

Ktr Hindi

జాతీయ భాషగా హిందీ(Hindi )ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. జైపూర్‌లో జరిగిన “టాక్ జర్నలిజం” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేశాన్ని ఉత్తర భారత దేశ ఎంపీల ఆధారంగా నడపడం దక్షిణ భారత ప్రజలకు అన్యాయంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు ఉండటంతో కేంద్రం ఎప్పటికీ ఆ రాష్ట్రాల హితమే చూస్తుందని, ఇది సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

1971లో జనాభా ఆధారంగా ఎంపీ స్థానాల సంఖ్యను ఫ్రీజ్ చేసిన కేంద్రం, ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్‌ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పింది. దక్షిణ భారత దేశం ఆ మార్గదర్శకాలను నిబద్ధతతో అమలు చేయగా, ఉత్తర భారతదేశం పూర్తిగా విఫలమైంది. కేరళ వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కేవలం 69 శాతం ఉండగా, యూపీలో అది 239 శాతానికి పెరిగిందని కేటీఆర్ వివరించారు. అయినప్పటికీ ఇప్పుడు పునర్విభజనలో తక్కువ జనాభా ఉన్న దక్షిణ రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Shocking : జస్ట్ మిస్.. ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టబోయిన యుద్ధ విమానం

ఈ అంశంపై కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ ఒకే అభిప్రాయంతో ఉందని తెలిపారు. చెన్నైలో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఒకే గొంతుతో గళమెత్తినట్టు తెలిపారు. ఎప్పటికీ ఎంపీ స్థానాల ఆధారంగా ప్రధానిని ఉత్తరాదే ఎన్నుకుంటే, దక్షిణాది ప్రయోజనాలు బలైపోతాయని, కనీసం అసెంబ్లీ సీట్ల పెంపునైనా త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో మంజూరు చేసిన అసెంబ్లీ సీట్లు పెంచడంలో కేంద్రం విఫలమైందని, కానీ తమ అవసరాల కోసం జమ్మూ కాశ్మీర్, అస్సాంలో సీట్లు పెంచినదాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

దేశానికి ఒకే జాతీయ భాష అవసరం లేదని కేటీఆర్ స్పష్టంగా తెలిపారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, ప్రతి 250 కిలోమీటర్లకు భాష, సంస్కృతి, ఆహారం మారుతాయని వివరించారు. హిందీని రుద్దడం ద్వారా తక్కువ ప్రజలు మాట్లాడే భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. “ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచంలో అవకాశాలు పొందవచ్చు. కానీ హిందీ నేర్చుకొని అమెరికా వెళ్లి ఏం ప్రయోజనం?” అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. దేశ భవిష్యత్ కోసం భాషల మధ్య సమానత్వం అవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.