Site icon HashtagU Telugu

Jamili Election : జమిలి ఎన్నికలపై త్వరలో కేంద్రానికి కోవింద్‌ కమిటీ నివేదిక

Kovind Committee Report On

Kovind Committee Report On

 

 

Jamili Election Committee Report : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల(Jamili Election) సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకుగాను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో సెప్టెంబర్‌ 2023న ఓ కమిటీ ఏర్పాటైంది.

2029 నుంచి ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా నిబంధనలను మార్చే విధానాన్ని సూచించడమే కాకుండా లోక్‌సభ, అసెంబ్లీలతోపాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితా ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలతోపాటు రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాల్సిన అవసరం ఉంటుందని సమాచారం. పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్‌ 83, రాష్ట్రపతి లోక్‌సభ రద్దుపై ఆర్టికల్‌ 85, రాష్ట్ర శాసనసభల వ్యవధికి సంబంధించి ఆర్టికల్‌ 172, రాష్ట్ర శాసనసభల రద్దుపై ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి ఆర్టికల్‌ 356 ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు నిర్వహిస్తాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు నిర్వహించాలని బీజేపీ వంటి పార్టీలు కోవింద్‌ కమిటీకి సూచించాయి. మరోవైపు, ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల కోసం ప్రతి 15 ఏళ్లకు సుమారు రూ.10వేల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది.

read also : Circuit Tour Buses : సర్క్యూట్ టూర్ బస్సులను సిద్ధం చేసిన APSRTC

ఇదిలా ఉంటే, జమిలి ఎన్నికలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్‌ కూడా కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని (చాప్టర్‌) చేర్చాలని అది సూచించనున్నట్లు సమాచారం. ఈ నివేదిక ప్రకారం దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్‌లో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ఇటీవల తెలిపాయి.