Kolkata Horror : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురాగతం వ్యవహారం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసుపై ఇప్పుడు సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఒకరు సంజయ్ రాయ్. ఇతడు సదరు కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన సెమినార్ హాలు నుంచి అతడు బయటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ సీబీఐ చేతికి చిక్కింది. ఇక కాలేజీ మాజీ ప్రిన్సిపల్, డాక్టర్ సందీప్ ఘోష్‌ను ఇటీవలే సీబీఐ అరెస్టు చేసింది. సాక్ష్యాలను మాయం చేసేందుకు యత్నించారని, ఎఫ్‌ఐఆర్ నమోదులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారనే అభియోగాలను ఆయనపై సీబీఐ మోపింది. విచారణలో సందీప్ ఘోష్ స్పందిస్తున్న తీరుపై తాజాగా సీబీఐ(Kolkata Horror) కీలక వివరాలను బయటపెట్టింది.
Also Read :Anna Hazare : రాజకీయాల్లోకి రావొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదు : అన్నా హజారే
డాక్టర్ సందీప్ ఘోష్ నోటితో నిజాలను చెప్పించేందుకు సీబీఐ ఆయనకు పాలీ గ్రాఫ్ (లై డిటెక్టర్), వాయిస్ అనాలిసిస్ పరీక్షలను నిర్వహించింది. దాదాపు వారం రోజుల పాటు ఆయనను కంటిన్యూగా గంటల తరబడి ప్రశ్నించింది. అయితే ఈ టెస్టుల టైంలోనూ సందీప్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కేసుతో ముడిపడిన ముఖ్యమైన ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలిచ్చి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారని చెబుతున్నాయి. లై డిటెక్టర్ పరీక్షలో సందీప్ చెప్పిన సమాధానాలను విచారణ కోసం అధికారికంగా పరిగణనలోకి తీసుకునేందుకు చట్టం అనుమతించదు. కాకపోతే ఆ పరీక్షల టైంలో నిందితులు ఇచ్చే సమాధానాల ఆధారంగా సీబీఐ సాక్ష్యాలను సేకరిస్తుంది. వాటిని నిరూపించేందుకు ప్రయత్నిస్తుంది.
Also Read :Elderly Population : రికార్డు స్థాయిలో పెరిగిన వృద్ధుల జనాభా.. సర్వత్రా ఆందోళన
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిందనే విషయం ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్‌కు ఆగస్టు 9న ఉదయం 9.58 గంటలకు తెలిసింది. అయితే ఆయన ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు చేరవేయలేదు. అలా ఎందుకు చేశారు ? ఎవరిని కాపాడేందుకు యత్నించారు ? అనే ప్రశ్నలకు సమాధానాలను వెతికే పనిలో సీబీఐ ఉంది. ఎఫ్ఐఆర్ లేటుగా నమోదు చేయడంతో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సహకరించారని భావిస్తున్న తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి రానున్నాయి. సందీప్ ఘోష్, అభిజిత్ మండల్‌లు కలిసి హత్యాచార ఘటన తీవ్రతను తక్కువ చేసేందుకు యత్నించారని సీబీఐ అనుమానిస్తోంది.