Site icon HashtagU Telugu

Kharge : సర్వేలో కేంద్రం చూపుతున్న ప్రతీది బాగుంటే..ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారు?

Kharge Targets Centre Says Household Consumption Expenditure Survey Election Inspired

Kharge Targets Centre Says Household Consumption Expenditure Survey Election Inspired

 

Kharge On BJP : మరోసారి కేంద్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) విమర్శలు చేశారు. పదేళ్లపాటు గాఢనిద్రలో ఉన్న ఎన్​డీఏ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గృహ వినియోగ వ్యయ సర్వేను విడుదల చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సర్వేలో కేంద్రం చూపుతున్నట్లుగా ప్రతీది బాగుంటే, గ్రామాల్లో ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.

కచ్చితమైన సమాచారం కోసం త్వరలోనే జనాభా గణనను నిర్వహించాలని, అందులో కుల గణనను కూడా చేర్చాలని ఎక్స్  వేదికగా ఖర్గే డిమాండ్ చేశారు. “మాది ఒకే ఒక్క డిమాండ్. సరైన సమాచారం కోసం 2021 జనాభా గణనను వీలైనంత త్వరగా చేయాలి. కుల గణనను కూడా అందులో భాగం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనిని పూర్తి చేస్తుంది” అంటూ కాంగ్రెస్ చీఫ్ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు.

“ప్రభుత్వ పథకాల నుంచి ఐదు శాతం పేద కుటుంబాలు ఎందుకు తక్కువ ప్రయోజనం పొందాయి? కేవలం నెలకు 68 రూపాయలే పొందాయా? పెట్టుబడిదారీ మిత్రులు మిగిలిన ప్రయోజనాలను పొందారా? రైతుల నెలవారీ ఆదాయం గ్రామీణ భారతదేశ సగటు ఆదాయం కంటే ఎందుకు తక్కువగా ఉంది? మోదీ ప్రభుత్వం ఉజ్వల పథకం విజయవంతమైందని గొప్పలు చెప్పకుంటున్నారు. మరి గ్రామీణ కుటుంబాల ఇంధన వ్యయం 1.5 శాతంగా మాత్రమే ఎందుకు ఉంది?” అని ఖర్గే ప్రశ్నించారు.

నీతి ఆయోగ్ అధికారులు భారతదేశంలో పేదరికం కేవలం ఐదు శాతమేనని చెబుతున్నారని, అయితే అదే నీతి ఆయోగ్‌కు చెందిన మరో నివేదిక ప్రకారం పేదరికం 11.28 శాతంగా ఉందని ఖర్గే చెప్పారు. మోదీ ప్రభుత్వం పేదలను ఎందుకు హేళన చేస్తోందని ప్రశ్నించారు. సర్వేల ఖ్యాతి తగ్గించవద్దని మోదీని ఖర్గే కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆహార ద్రవ్యోల్బణం కొలిచే ప్రమాణాలను మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. నకిలీ డేటాతో ద్రవ్యోల్బణాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. 2017-18కి జీడీపీ బేస్ ఇయర్‌ను మార్చాలనే కేంద్రం ప్రతిపాదనను నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ తిరస్కరించిందని, పీఐబీ పత్రికా ప్రకటనలో మోదీ ప్రభుత్వం సైతం ఆ విషయాన్ని అంగీకరించిందని అన్నారు. ఇది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు.

వాస్తవాలను దాచిపెట్టి జీడీపీ బేస్ ఇయర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాన్ని పొందాలనుకుంటోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అసలు ఈ గృహ వినియోగ వ్యయ సర్వే 69వ రౌండ్ దా లేక 70వ రౌండ్ దా అనేది తెలియదని ఆయన వ్యాఖ్యలు చేశారు. నకిలీ డేటాను గుర్తించకుండా ఉండేందుకే ఈ సర్వే ఏ రౌండ్​దో కేంద్ర చెప్పడం లేదని ఆరోపించారు.

read also : Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్