Pannun Threat : అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బరితెగించాడు. ఈసారి అతగాడు అయోధ్యలోని రామమందిరం సహా పలు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని బెదిరింపు హెచ్చరికలు జారీ చేశాడు. ఈమేరకు ఒక వీడియోను పన్నూకు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం.. నవంబర్ 16, 17 తేదీల్లో భారత్‌లోని ప్రముఖ ఆలయాలపై దాడి చేస్తామని పన్నూ హెచ్చరించాడు. ఈ లిస్టులో అయోధ్య రామమందిరం కూడా ఉందని అతడు తెలిపాడు. ‘‘హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను మేం కదిలిస్తాం’’ అని పన్నూ హెచ్చరించడం గమనార్హం. ‘‘కెనడాలోని హిందూ ఆలయాలపై రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. అందుకే అక్కడి హిందువులు కూడా హిందూ దేవాలయాలకు దూరంగా ఉంటే మంచిది’’ అని అతడు హెచ్చరిక సందేశంలో(Pannun Threat) ప్రస్తావించాడు. ‘‘కెనడా సహా ఇతర దేశాల్లోని భారత దౌత్యవేత్తలు అలర్ట్‌గా ఉండాలి. వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది’’ అని పన్నూ తెలిపాడు.
Also Read :Miraya Vadra : మిరాయా వాద్రా ఎవరో తెలుసా ? ప్రియాంకకు మద్దతుగా ప్రచారం
గత నెలలోనూ ఇదే విధంగా వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో సందేశాన్ని పన్నూ విడుదల చేశాడు. నవంబరు 1 నుంచి 19 మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశాడు. ‘1984 సిక్కుల ఊచకోత’ ఘటనకు 40 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబరు 1 నుంచి 19 మధ్య ఏదైనా జరగొచ్చు అని వార్నింగ్‌లో పన్నూ ప్రస్తావించాడు. పన్నూకు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థపై భారత్‌లో నిషేధం అమల్లో ఉంది. ఈ సంస్థ భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న కొంత భూభాగాన్ని ఖలిస్తాన్ పేరు కలిగిన ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. కొన్ని నెలల క్రితం భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థలు పన్నూకు పంజాబ్‌లో ఉన్న పలు ఆస్తులను సీజ్ చేసింది. అతడితో సంబంధమున్న చాలామందిని అదుపులోకి తీసుకొని విచారించి కీలక సమాచారాన్ని సేకరించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ లాంటి ఉగ్రవాదులకు అమెరికా, కెనడా దేశాలు పాలుపోసి పెంచుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.