Rajya Sabha 2024 : 2024 సంవత్సరంలో పదవీ కాలం పూర్తికానున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో పలు పార్టీల అగ్రనేతలు ఉన్నారు. ఈ లిస్టులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, మన్‌సుఖ్ మాండవీయ ఉన్నారు. మరో ఐదు నెలల్లో పదవీకాలం పూర్తయ్యే రాజ్యసభ సభ్యులలో జీవీఎల్ నరసింహారావు, భూపేందర్ యాదవ్, నారాయణ రాణే, పరుషోత్తమ్ రూపాలా, రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్, ఎల్.మురుగన్ పేర్లు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో అత్యధికంగా 27 మంది బీజేపీ, 10 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, టీడీపీ, వైఎస్సార్ సీపీల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈవిధంగా ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి 2024 మార్చిలోనే(Rajya Sabha 2024) ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
- హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రానికి మారనున్నారని తెలుస్తోంది.
- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ సీట్లు లాభపడే వీలుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ ఇప్పుడున్న ఒక సీటుకు అదనంగా మరో రెండు స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు.
- రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చేసారి రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
- రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకు 6, సమాజ్‌వాదీ పార్టీకి 3 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.
- మహారాష్ట్రలోని 6 సీట్లను బీజేపీ, ఇండియా కూటమిలోని పార్టీలు సగం సగం పంచుకొనే సూచనలు ఉన్నాయి.
- బీహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ కూటమి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోనుంది.
- గుజరాత్‌లో 2 సీట్లను కాంగ్రెస్ నుంచి బీజేపీ లాక్కునే ఛాన్స్ ఉంది.
- బీజేపీకి రాజస్థాన్‌లో మరో సీటు అదనంగా దక్కే అవకాశం ఉంది.
- ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో ఇప్పుడున్న బలాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిలబెట్టుకుంటాయని అంచనా వేస్తున్నారు.
- హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోనుంది.