Adani FPO: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం…FPO రద్దు

హిండెన్ బర్గ్ నివేదికతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బిజినెస్ మేన్ గౌతమ్ అదానీ  గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. హిండెన్‌బర్గ్

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 11:59 PM IST

Adani Cancels FPO: హిండెన్ బర్గ్ నివేదికతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ బిజినెస్ మేన్ గౌతమ్ అదానీ  గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 20,000 కోట్ల విలువైన షేర్ల ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీవో)ని రద్దు చేస్తున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రూ. 20,000 కోట్ల వరకు ఉన్న ఈక్విటీ షేర్ల తదుపరి పబ్లిక్ ఆఫర్ ను కొనసాగించకూడదని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. పాక్షికంగా చెల్లించిన ప్రాతిపదికన ఒక్కొక్కటి రూ. 1 విలువ, ఇది పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేస్తున్నామని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక చేసిన తీవ్ర ఆరోపణల మధ్య అదానీ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ మొదటి రెండు రోజూలూ నత్తనడకలా సాగిన ఈ ఎఫ్‌పిఓ చివరి రోజున పూర్తి సబ్‌స్క్రిప్షన్‌తో గట్టెక్కింది. అయితే ప్రస్తుత మార్కెట్లలో కొనసాగుతున్న ఒడుదుడుకులు, అనూహ్య పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ అదానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎఫ్‌పిఓ పట్ల నమ్మకంతో ముందుకు వచ్చిన ఇన్వెస్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇన్వెస్టర్లకు వారి సొమ్మును తిరిగిచ్చేందుకు తమ లీడ్ మేనేజర్స్‌తో పని చేస్తున్నామని, తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉందని, ఎఫ్‌పిఓ ఉపసంహరణ నిర్ణయం భవిష్య కార్యాచరణపై ప్రభావాన్ని చూపించదని గౌతమ్ అదానీ స్పష్టం చేశారు.

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు.. స్టాక్‌ మ్యానిపులేషన్‌తో పాటు అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతోందని.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. సుమారు 218 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. దశాబ్దాలుగా ఇదే పద్ధతిలో నడుస్తున్నట్లు.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ 103 పేజీల సంచలన నివేదిక విడుదల చేసింది. దీనిపై అదానీ గ్రూప్ తీవ్రంగా స్పందించింది. భారత్, భారతీయ సంస్థలు అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వివాదం భారత పారిశ్రామిక రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.