Site icon HashtagU Telugu

Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి

Nimisha Priya

Nimisha Priya

Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష విధింపునకు గురవుతున్న కేరళ నర్సు నిమిష ప్రియ భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారుతోంది. నిమిషపై హత్య ఆరోపణలు చేస్తున్న బాధితుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబం తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆమెను త్వరితగతిన ఉరితీయాలని యెమెన్ హౌతీ ప్రభుత్వాన్ని వారు మరోసారి ఒత్తిడి చేస్తున్నారు.

ముందుగా జూలై 16న ఉరితీయాల్సి ఉన్న నిమిషా శిక్ష, నిరవధికంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాధితుడి కుటుంబం “ఇంకా ఆలస్యం వద్దు” అని స్పష్టం చేస్తూ, ఉరితీశ్చాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతా అబ్దో మహదీ ఆగస్టు 3న యెమెన్ అటార్నీ జనరల్ జడ్జి అబ్దుల్ సలాం అల్ హౌతీకి లేఖ రాశారు.

“శిక్ష విధించాల్సిన తేదీ గడిచిపోయి ఒకటిన్నర నెలలు అవుతోంది. ఇంకా కొత్త తేదీని నిర్ణయించలేదు. మా హక్కును అమలు చేయాలని మేము పట్టుబడుతున్నాం. ఎటువంటి మధ్యవర్తిత్వం లేదా రాజీకి మేము అంగీకరించం,” అని లేఖలో పేర్కొన్నారు. మహదీ కుటుంబం తమ న్యాయం, చట్టబద్ధ హక్కుల కోసం మరణశిక్ష తప్పనిసరి అని పేర్కొంది.

ఇక భారత ప్రభుత్వం నుంచి సహాయం ఆశించిన నిమిషా పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం యెమెన్‌కు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని భారత ప్రభుత్వం తెలిపింది. కారణం – అక్కడి ప్రమాదకరమైన భద్రతా పరిస్థితులు. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఈ బృందానికి బాధితుడి కుటుంబంతో క్షమాపణ కోసం చర్చలు జరపడానికి అనుమతి ఇచ్చింది. కానీ, ఆ ప్రయాణానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి అవసరం.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, యెమెన్‌లో భారతీయుల ప్రయాణం నిషేధించబడింది. హౌతీలతో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. గతంలో సనాలో భారత రాయబార కార్యాలయం ఉన్నప్పటికీ, భద్రతా కారణాల వల్ల దానిని సౌదీ అరేబియాకు తరలించారు.

నిమిష ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందినది. 2008లో యెమెన్ వెళ్లి నర్సుగా పని చేయడం ప్రారంభించింది. తర్వాత తలాల్ అబ్దో సహాయంతో అక్కడ క్లినిక్‌ను ఏర్పాటు చేసుకుంది. అయితే, తలాల్ వేధింపులు చేయడం మొదలుపెట్టాడని నిమిష న్యాయవాది ఆరోపించారు. ఈ వేధింపుల నుంచి తప్పించుకోవడానికి, తలాల్‌కు డ్రగ్స్ ఇచ్చిందని, అది అతని మరణానికి దారితీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, నిమిష ప్రియ భవిష్యత్తు అనిశ్చితిలోకి నెట్టబడింది. బాధితుడి కుటుంబం వెనక్కి తగ్గని వైఖరితో, ఆమెకు శిక్ష తప్పదన్న భయం మరింతగా పెరుగుతోంది.

BRS : బీఆర్‌ఎస్‌కు షాక్‌.. గువ్వల బాలరాజు రాజీనామా