Site icon HashtagU Telugu

VS Achuthanandan : కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌(101) కన్నుమూత

Vs Achuthanandan

Vs Achuthanandan

VS Achuthanandan : కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి అజరామరమైన నాయకుడు వి.ఎస్. అచ్చుతానందన్ ఇక లేరు. 101 ఏళ్ల వయసులో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలు అందించిన అచ్చుతానందన్‌ మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అచ్చుతానందన్ జీవితమంతా కష్టనష్టాలతో కూడుకున్నది. 1923లో అలప్పుజా జిల్లా పున్నప్రలోని ఒక వ్యవసాయ కార్మికుల కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, పేదరికంలో పెరిగారు. అయినప్పటికీ ఆయనకు ఉన్న ఆత్మస్థైర్యం, పోరాటస్ఫూర్తి రాజకీయాల్లో అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

16 ఏళ్ల వయసులోనే ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు పి.కృష్ణ పిళ్లై సలహాతో స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగుపెట్టారు. కృష్ణ పిళ్లైను ఆయన జీవితంలో తనకు ప్రేరణగా భావించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలపై ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది.

1964లో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి విడిపోయి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఏర్పాటులో వ్యవస్థాపక సభ్యుల్లో అచ్చుతానందన్ ఒకరు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, కార్యకలాపాలను బలపరచడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనను ప్రభుత్వం జైలులో నిర్బంధించింది. క్రమశిక్షణ, సూటి రాజకీయ వైఖరి, స్పష్టమైన అభిప్రాయాలు ఆయన ప్రత్యేకత.

2006లో కేరళ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అచ్చుతానందన్ పాలనలో రాష్ట్రానికి అనేక సంస్కరణలు వచ్చాయి. అయితే ఆయన ఎప్పుడూ పార్టీ క్రమశిక్షణలోకి పూర్తిగా ఇమడని నాయకుడిగా పేరుపొందారు. 2009లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ నిర్ణయాలను ధిక్కరించినందుకు ఆయనను పార్టీ పొలిట్ బ్యూరో నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ ఆయనకు ప్రజల మధ్య ఉన్న గుర్తింపు ఎప్పటికీ తగ్గలేదు.

2019లో అచ్చుతానందన్ స్వల్ప హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యారు. అప్పటి నుంచి ప్రజా జీవితానికి దూరమై, తిరువనంతపురంలోని తన కుమారుడు అరుణ్ కుమార్ నివాసంలో విశ్రాంతి జీవితం గడిపారు. ఈ కాలంలో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. చివరికి జూలై 21న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

NEET : నీట్ యూజీ-2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు షురూ..