Kerala CM : కేరళ సీఎంను ఇరకాటంలో పెట్టిన గుజరాత్ మోడల్ వివాదం

కేరళ ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్.. తన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీపీజాయ్ ని గుజరాత్ కు పంపించారు.

Published By: HashtagU Telugu Desk
Pinarayi Vijayan

Pinarayi Vijayan

కేరళ ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్.. తన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీపీజాయ్ ని గుజరాత్ కు పంపించారు. అక్కడి ఈ గవర్నెన్స్ డ్యాష్ బోర్డు ను పరిశీలించి రమ్మన్నారు. ఆయన దానిని అధ్యయనం చేశారు. అది బాగుందని విజయన్ కు చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించవచ్చని, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను కూడా తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలును కూడా తెలుసుకోవచ్చన్నారు. ఇంతవరకు ఓకే. కానీ అసలు వివాదం అక్కడే మొదలైంది.

కేరళ ముఖ్యమంత్రి నిర్ణయం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఎందుకంటే గుజరాత్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కేరళలో ఉన్నది లెఫ్ట్ పార్టీ ప్రభుత్వం. రాజకీయంగా ఈ రెండు పార్టీలకు పడదు. దీంతో సీఎం విజయన్ ఇప్పటికైనా గుజరాత్ మోడల్ గొప్పదనాన్ని గుర్తించినందుకు సంతోషం అని బీజేపీ అంది. కాంగ్రెస్ మాత్రం కేరళ ప్రభుత్వ తీరును విమర్శించింది.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ గెలిచింది కూడా గుజరాత్ మోడల్ ను దేశానికి చూపించే. కానీ విచిత్రంగా ఆ తరువాత ఎక్కడా బీజేపీ గుజరాత్ మోడల్ గురించి చెప్పుకోలేదు. కానీ ఈమధ్యకాలంలో ప్రధాని నరేంద్రమోదీని పినరయి విజయన్ కలిశారు. మరి ఆ సమయంలో మోదీ ఏమైనా గుజరాత్ మోడల్ గురించి ప్రస్తావించి .. ఓసారి మీవాళ్లను పంపించి అధ్యయనం చేయండి అని ఏమైనా ప్రస్తావించారా? అందుకే విజయన్ తమ చీఫ్ సెక్రటరీని పంపించారా? అన్న వాదనా లేకపోలేదు.

కేరళలో కూడా ఈ-డ్యాష్ బోర్డ్ ఉంది. 2020లో కరోనా సమయంలో కేరళ అనుసరించిన కొవిడ్ డ్యాష్ బోర్డుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అందుకే కేరళలో పూర్తిస్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ-గవర్నెన్స్ ను అమలు చేద్దామని విజయన్ అనుకుని ఉండొచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. గుజరాత్ ఈ-గవర్నెన్స్ ను అమలు చేయడమంటే.. గుజరాత్ మోడల్ ను అమలు చేయడం కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే.. ఇప్పుడు సీపీఎం ప్రభుత్వాన్ని విపక్షాలు ఎలా విమర్శిస్తున్నాయో.. గతంలో ఇదే సీపీఎం… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఆనాటి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేసినందుకు ఘోరంగా విమర్శించింది. మంచికి పోతే చెడు ఎదురైనట్టు.. ప్రజలకు మేలు చేద్దామనుకున్న సీఎం విజయన్ కు బీజేపీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.

  Last Updated: 12 May 2022, 02:23 PM IST