Site icon HashtagU Telugu

Indian Currency: కరెన్సీ ఫై హిందూ దేవుళ్ళు, భారత్ ఆర్థిక వ్యవస్థకు `కేజ్రీ` ఫార్ములా

Kejriwal

Kejriwal

భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుపడేందుకు `ఇండోనేషియా` ఫార్ములాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతోపాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం సంచలనం రేపుతోంది. కరెన్సీలపై దేవుళ్ల ఫొటోలు పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఆశీర్వాదం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దేవుళ్లు కరెన్సీ నోట్లపై ఉంటే దేశం మొత్తం వారి ఆశీర్వాదం పొందుతుందని, లక్ష్మీ శ్రేయస్సుకు దేవత, గణేశుడు కష్టాలను దూరం చేసే దేవుడు అని కేజ్రీవాల్ అన్నారు.

రూపాయి విలువ నిరంతరం పడిపోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించడం, దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయని ఉటంకించారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సార్లు మంచి ఫలితం ఉండదని, దేవుళ్ల ఆశీస్సులు అవసరమని అన్నారు. వ్యాపారవేత్తలు తమ కార్యాలయంలో హిందూ దేవుళ్ల విగ్రహాలను ఉంచుకుని, ప్రతిరోజూ పూజలు చేస్తారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Also Read:  Congress President : కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే పదవీస్వీకారం

అదే పద్దతిలో కరెన్సీ నోట్లపై దేవుళ్ల ఫొటోలు పెడితే దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించడం ఖాయమన్నారు. ప్రతి నెలా ముద్రించే తాజా కరెన్సీలకు విగ్రహాల ఫొటోలను జోడించవచ్చని, ప్రస్తుత కరెన్సీ నోట్లను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని కేజ్రీ తెలిపారు. ఇది క్రమంగా ప్రజల్లోకి వెళుతుందని ఆయన అన్నారు. ఇండోనేషియాను ఉదాహరణగా తీసుకుంటూ, దేశంలో మొత్తం జనాభాలో 2 శాతం కంటే తక్కువ హిందువులు ఉన్నప్పటికీ, వారి కరెన్సీ నోట్లపై గణేశుడిని ముద్రించారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అలాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసిన గొప్ప చర్యగా భావిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి తన ఆలోచనపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన తన “ఔరంగజేబ్ ఇమేజ్”ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని అన్నారు. యమునా నదిని కూడా కేజ్రీవాల్ శుభ్రం చేయలేరని బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ తివారీ విమర్శించారు. అతని చర్యలు అతని మాటలతో సరిపోలడం లేదని, అతని ఆలోచనే సరైనది కానప్పుడు, అతని మాటలను ఎవరైనా ఎలా పట్టించుకోగలరు? అంటూ బిజెపి నాయకుడు నలిన్ కోహ్లి కూడా ఆప్ అధినేతపై దాడి చేస్తూ, “కేజ్రీవాల్ రాజకీయాలన్నీ రాజకీయ మైలేజీని పొందడం కోసం ఏదైనా మాట్లాడతారని దుయ్యబట్టారు.

Also Read:   JP Nadda Munugode: మునుగోడు గడ్డపైకి నడ్డా.. కీలక ప్రకటనకు ఛాన్స్