Site icon HashtagU Telugu

Delhi: దళిత పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి కేజ్రీవాల్ విందు..!!!

Kejriwal

Kejriwal

అన్ని రకాలుగా బీజేపీని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో గుజరాత్‌ను చేజిక్కించుకోవడంపై ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పుడు దృష్టిసారించారు. పంజాబ్‌లో ప్రభంజనం సృష్టించిన కేజ్రీవాల్ గుజరాత్‌లో కూడా బీజేపీని గద్దెదింపాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా అక్కడి దళితులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అహ్మదాబాద్‌లో ఆదివారం దళిత పారిశుద్ధ్య కార్మికులతో టౌన్‌హాల్‌లో జరిగిన సమావేశంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని ఢిల్లీలో తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. కేజ్రీవాల్ ఇటీవల అహ్మదాబాద్‌లోని టౌన్‌హాల్ సమావేశంలో ఆటోరిక్షా డ్రైవర్ నుంచి విందు ఆహ్వానాన్ని స్వీకరించడం తాను చూశానని ఆ సమావేశంలో పాల్గొన్న హర్ష్ సోలంకి గుర్తు చేసుకున్నాడు. తన ఇంటికి కూడా భోజనానికి వస్తారా? అని సోలంకి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాడు.

ఈసారి అహ్మదాబాద్ వచ్చినప్పుడు భోజనానికి తప్పనిసరిగా మీ ఇంటికి వస్తానని చెప్పి, అంతకంటే ముందే ఢిల్లీలో తన ఇంటికి భోజనానికి రావాలని సోలంకీని కేజ్రీవాల్ ఆహ్వానించారు. హర్ష్ సోలంకి ఆనందానికి అవధులులేవు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నేతా ఇలాంటి పనిచేయలేదని ప్రశంసించాడు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే మా కోసం ఒకరు ఉన్నారన్న ఆశ కలుగుతోంది సర్’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అందుకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. చాలామంది నేతలు దళితుల ఇంటికి భోజనానికి వెళ్లి షో చేయడాన్ని తాను చూశానని, ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా దళితుడిని తన ఇంటికి భోజనానికి పిలవలేదన్నారు. మీ కుటుంబ సభ్యులు మా ఇంటికి వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పారు.

సోలంకి కుటుంబ సభ్యులకు కేజ్రీవాల్ విమాన టికెట్లు కూడా పంపారు. సోమవారం తన ఇంటికి భోజనానికి వచ్చిన సోలంకి, అతని తల్లి, సోదరిలకు కేజ్రీవాల్ సాదర స్వాగతం పలికారు. దాంతో సోలంకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేజ్రీవాల్ అతనిని ఓదార్చరు. అనంతరం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు వారితో కలిసి భోజనం చేశారు. తరువాత కేజ్రీవాల్ ఆ కుటుంబానికి జ్ఞాపిక అందజేశారు. చివరగా సోలంకి కుటుంబ సభ్యులతో కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు ఫొటో తీయించుకుని, వారికి వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.