Site icon HashtagU Telugu

Nitish Kumar KCR : హ‌ర్యానా కేంద్రంగా నితీష్, కేసీఆర్ జాతీయ రేస్

Kcr Nitish

Kcr Nitish

హ‌ర్యానా కేంద్రంగా విప‌క్షాల ఐక్య‌త నిరూపితం కానుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో సహా ప్రతిపక్ష నాయకుల హాజరయ్యే ఈ ర్యాలీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మార్గం వేయ‌నుంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల కలిసే వేదిక‌గా క‌నిపిస్తోంది. ఈ ర్యాలీ చారిత్రాత్మకమైన ‘సమ్మన్ దివస్’ అని, లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో మార్పుకు నాంది పలుకుతుందని INLD పేర్కొంది.

కేసీఆర్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి పలువురు ప్రాంతీయ నేతలు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. ఆహ్వానితుల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌ అధినేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌తో పాటు పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యే అవకాశం ఉందని ఐఎన్‌ఎల్‌డీ నేతలు చెబుతున్నారు.

బీజేపీతో పొత్తు నుంచి వైదొలగిన తర్వాత బీహార్‌లో నితీశ్‌కుమార్‌తో భేటీ అయిన‌ కేసీఆర్ గత వారం హైదరాబాద్‌లో జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామితో కూడా చర్చలు జరిపారు. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో జాతీయ పార్టీని ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు. గుజరాత్, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తన అడుగుజాడలను విస్తరించేందుకు ప్రయత్నిస్తుందని, ఆయా రాష్ట్రాల నేతల మద్దతును కోరనున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.

INLD చీఫ్హ, హ‌ర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా అనేక వర్గాల నాయకులను ఆహ్వానిస్తున్నప్పటికీ, ఆహ్వానితులలో కాంగ్రెస్ స్పష్టంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టిఆర్ఎస్, జెడిఎస్, టీఎంసితో సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ మైనస్ ప్రతిపక్ష కూటమికి మొగ్గు చూపినప్పటికీ, నితీష్ కుమార్ అందుకు సుముఖంగా లేరు. ప్రత్యర్థి పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీశ్ కీలక పాత్ర పోషించినా, జాతీయ స్థాయిలో ఆయనతో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. నితీష్, కేసీఆర్ మధ్య జరిగిన చివరి భేటీ సానుకూలంగా ముగియనప్పటికీ, కేసీఆర్ ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నాయకుడు ఒక‌రు చెప్పారు.

గత వారం రాహుల్ గాంధీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ మరియు సీపీఐ(ఎం) సీతారాం ఏచూరితో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులను నితీష్‌ కలిశారు. 2019 ఎన్నికలలో, ఎల్లనాబాద్ నుండి ఎన్నికల్లో అభయ్ మాత్రమే గెలవడంతో INLD పరాజయం పాలైంది. ఇప్పుడు రద్దు చేయబడిన మూడు వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఏడాదిపాటు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా అతను తన సీటుకు రాజీనామా చేశాడు. 87 ఏళ్ల జాట్ నాయకుడు ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన చౌతాలా, తన పదేళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుని గత ఏడాది జైలు నుండి బయటకు వచ్చారు. `సమ్మాన్ దివాస్` ద్వారా హర్యానా రాజకీయాల్లో INLD పూర్వ‌వైభవ కోసం ప్ర‌య‌త్నిస్తోంది.