Site icon HashtagU Telugu

KCR@Delhi: అఖిలేశ్‌తో మాత్రమే భేటీ….మిగతా వారి సంగతేంటి ?

Akhilesh Kcr

Akhilesh Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండుగంటలకుపైగా ఈ భేటీ కొనసాగింది. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అఖిలేష్‌ యాదవ్‌ వెంట సమాజ్‌ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ ఉన్నారు. జాతీయ స్ధాయిలో కొత్త కూటమిని ఏర్పాటు విషయంలో కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులను కలిశారు. తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ.. ఆయన ఎవరితోనూ కలవకుండానే హైదరాబాద్‌కు పయనం అవుతున్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారని భావించారు. ఎన్నికల ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నూతన రాష్ట్రపతిని కలిసి అభినందనలు చెబుతారని ప్రచారం జరిగింది. కొత్త రాష్ట్రపతిని కలవడంతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపై కూడా కేసీఆర్‌ చర్చలు జరుపుతారని ప్రధాన పార్టీల నేతలతో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చిస్తారని ప్రచారం జరిగింది. అందరి అంచనాలకు భిన్నంగా కేసీఆర్‌ నాలుగురోజులుగా ఎవరితోను అధికారికంగా భేటీ కాలేదు. ఆయన ఢిల్లీ వచ్చి జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని కలుస్తారని భావించినా అలా జరగలేదు. అదే సమయంలో కేసీఆర్‌ రాష్ట్రపతితో సైతం భేటీ కాలేదు. ఆయన ఢిల్లీలోని తన బంగ్లాకు పరిమితం అయ్యారు. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినా దక్కలేదా, ఆ‍యన ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version