Kashmir : కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అక్కడి యువతకు బీజేపీకి ఎగ్జిట్ డోర్ చూపించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ‘‘కశ్మీర్‌లో నిరుద్యోగ రేటు ఈ ఏడాది మార్చి నాటికి 28.2 శాతానికి పెరిగిపోయింది. అక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. వారిని మాయమాటలతో దగా చేసేందుకు బీజేపీ యత్నిస్తోంది. కానీ మోసపోయేందుకు కశ్మీరీ(Kashmir) యువత సిద్ధంగా లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కశ్మీర్‌లో గత నాలుగేళ్లలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయి. దీనివల్ల నియామక ప్రక్రియలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.అవినీతి, అక్రమాల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిపోయింది. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 65 శాతం ప్రభుత్వ పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి’’ అని ఖర్గే తన ఎక్స్ పోస్టులో వివరించారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో గత 15 ఏళ్లుగా 60,000 మందికిపైగా సిబ్బంది ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారికి రోజుకు రూ.300కు మించి వేతనం లభించడం లేదు. చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా.. వారి జాబ్స్‌ను పర్మినెంట్ చేసే నాథుడు లేకుండాపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు.
Also Read :Cars For Taxi : ట్యాక్సీ సర్వీసు కోసం నాలుగు బెస్ట్ కార్లు ఇవే..
‘‘కశ్మీర్‌లోని ప్రభుత్వ విద్యుత్, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ విభాగాల్లో చాలా పోస్టులు ఏళ్లతరబడి ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంతో ఆయా విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. ఆయా ఖాళీలను భర్తీ చేస్తే ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు’’ అని ఖర్గే తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని గతంలో బీజేపీ హామీ ఇచ్చినప్పటికీ.. వాటిని నిలుపుకోలేకపోయిందని ధ్వజమెత్తారు. కశ్మీర్‌లో ప్రస్తుతం ప్రజలకు ఉపాధి కోసం వ్యవసాయం, ఆతిథ్య రంగం, ఆరోగ్య రంగం మాత్రమే మిగిలాయన్నారు. చాలా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కశ్మీర్‌లో ఇంకా అమలు కాలేదని ఖర్గే చెప్పుకొచ్చారు. కాగా, కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీకి మూడు దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వస్తాయి.