Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికారుల ప్రకారం, గురెజ్ సెక్టార్‌లోని నౌషెహ్రా నార్డ్ ప్రాంతంలో కొందరు అనుమానాస్పద కదలికలను సైనికులు గుర్తించారు. వెంటనే వారు అప్రమత్తమై ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ప్రతిస్పందించింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు.
Commonwealth Games: కామన్‌వెల్త్ గేమ్స్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం!
ప్రస్తుతం ఆ ప్రాంతంలో విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారా అన్న దానిపై భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి. ఆగస్టు 25న బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్ వద్ద సరిహద్దు దాటే ప్రయత్నం విఫలమైంది. అంతకుముందు ఆగస్టు 13న అదే ఉరీ సెక్టార్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఒక భారత సైనికుడు వీరమరణం పొందారు.
కేవలం చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడమే కాకుండా, ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఓవర్‌గ్రౌండ్ వర్కర్లు (OGWs), సానుభూతిపరులను కూడా భద్రతా బలగాలు లక్ష్యంగా తీసుకుంటున్నాయి. డ్రగ్స్, హవాలా డబ్బు ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూరుతున్నాయని గుర్తించిన ఏజెన్సీలు, ఆ ఆర్థిక మార్గాలను మూసివేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా సమీక్ష సమావేశాల్లో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉగ్రవాదాన్ని మట్టికరిపించడానికి ఆర్థిక మూలాలను నాశనం చేయడమే ప్రధాన వ్యూహంగా రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలు ముందుకు సాగుతున్నాయి.