Site icon HashtagU Telugu

H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్‌.. ఇప్పుడు పోలీసులు ఇలా

Hd Kumaraswamy

Hd Kumaraswamy

H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ సంచలనం రేపే పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామికి అత్యున్నత న్యాయస్థానం ఎదుట గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు ఇదే కేసులో విచారణ కొనసాగించాలని స్పష్టం చేయగా, సుప్రీం కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం, నాలుగేళ్ల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది.

Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్

పోలీసులు రంగంలోకి.. విచారణ వేగం?
కోర్టుల్లో ఉపశమనం లభించకపోవడంతో, కర్ణాటక పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు. కుమారస్వామిని విచారించేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పోలీసు శాఖ అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామంతో కన్నడ రాజకీయాల్లో వేడి మరింత పెరిగింది.

భూవివాదం పుట్టించిన కలకలం
కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బెంగళూరు దక్షిణ తాలూకాలోని ఉత్తరహళ్లి హోబీలోని హలగేవడేరహళ్లి గ్రామంలోని రెండు ప్లాట్లను ఆర్థిక ప్రయోజనాల కోసం డీ-నోటిఫై చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. బీడీఏ (బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ) అభ్యంతరాలు తెలిపినా, 2007లో కుమారస్వామి భూమిని డీ-నోటిఫై చేయాలని ఆదేశించారని ఆరోపిస్తున్నారు. ఆ భూమిని 2010లో ప్రైవేట్ పార్టీలకు రూ. 4.14 కోట్లకు విక్రయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

మైనింగ్ స్కామ్‌తో మరింత చిక్కులు
ఇదే కాదు, బళ్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ మైనింగ్ కేసులో కూడా కుమారస్వామిపై అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి అనుమతులు ఇస్తూ నిబంధనలు ఉల్లంఘించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని రాజ్‌భవన్‌కు లేఖ కూడా పంపింది.

గవర్నర్ అనుమతి.. SIT ప్రశ్నల జడి?
అయితే, ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్ కన్నడ భాషలో ఉండటంతో.. దాన్ని ఆంగ్లంలోకి అనువదించాలంటూ రాజ్‌భవన్ నుంచి సూచన వచ్చింది. దాంతో సిట్ అధికారులు 4,500 పేజీల చార్జ్‌షీట్‌ను ఇంగ్లీష్‌లోకి మార్చి సమర్పించారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇస్తే, కుమారస్వామి సిట్ ఎదుట హాజరై విచారణకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

ఈ పరిణామాలతో, కర్ణాటకలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జేడీఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. కుమారస్వామి రాజకీయ భవితవ్యం ఏవిధంగా మలుపు తిరుగుతుందో.. వేచి చూడాల్సిందే!

Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు