CM Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన నైతిక విలువలతో ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రాఫిక్ చలానాల రాయితీ పథకాన్ని ఉపయోగించుకుని, తాను ప్రయాణించే అధికారిక వాహనంపై ఉన్న పెండింగ్ చలానాలను స్వయంగా చెల్లించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం ఏడుగురు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో ఆరు చలానాలు సీటు బెల్ట్ ధరించకపోవడంపై, మరొకటి అతివేగంగా వాహనం నడిపినట్లు ఉన్నదిగా తెలుస్తోంది. మొత్తం జరిమానా రుసుం ఎంతంటే ₹17,500. కానీ, ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం రాయితీ పథకం ప్రకారం కేవలం ₹8,750 మాత్రమే చెల్లించారు.
Read Also: Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అసలు రోజుకు ఎన్ని తినవచ్చు..?
ఈ ఘటనకు ముందు, సీఎం వాహనంపై పెండింగ్ చలానాల గురించి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులు కూడా చట్టాన్ని పాటించకపోతే, సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత చలానాలను త్వరితగతిన రాయితీతో చెల్లించిందని ప్రకటించింది. ఈ చర్యతో ముఖ్యమంత్రి నైతిక పాలనకు నిదర్శనంగా నిలిచారు. కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 19 వరకు ప్రత్యేకంగా ట్రాఫిక్ చలానాల రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం వాహనదారులు తమ పెండింగ్ చలానాలను 50 శాతం రాయితీతో చెల్లించుకోవచ్చు. మిగతా మొత్తం ప్రభుత్వం మాఫీ చేస్తోంది. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకు దాదాపు ₹40 కోట్లు వసూలయ్యాయని ట్రాఫిక్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య రాయితీ పథకాన్ని ఉపయోగించుకోవడం, ఆయన వ్యక్తిగతంగా చట్టాలను పాటించడానికి తీసుకున్న ప్రయత్నం సామాన్య ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. చట్టం ప్రతి ఒక్కరికీ సమానమే. అధికారులైనా, సాధారణ ప్రజలైనా నిబంధనల్ని పాటించడం తప్పనిసరి. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ చర్యతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాదు, వాటిపై నమ్మకాన్ని పెంచే విధానానికి శ్రీకారం చుట్టారు. చట్టాలు కేవలం గాలిలో చెప్పిన మాటలు కాదని, ఆచరణలోకి తేవాలంటే నాయకులే ముందుగా మొదలు పెట్టాలని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది.
ఇకపై ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్యను ఆదర్శంగా తీసుకుని, చట్టాల అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ పెద్దలపై ఉన్న విమర్శలలో ఒకటి తాము చెప్పిన నియమాలను తామే పాటించరని అయితే సిద్ధరామయ్య ఈ అభిప్రాయాన్ని తప్పుబట్టి, ప్రభుత్వ పథకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములే అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపారు. ఇది కేవలం జరిమానా చెల్లింపు మాత్రమే కాదు ప్రజాస్వామ్యంలో నైతికతకు అద్దంపడే చర్య.