kangana ranaut apologises : బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. రద్దు చేసిన సాగు చట్టాల ను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో కంగన స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.
”నా వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు.. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తాయన్న విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. వాటిని వెనక్కి తీసుకుంటున్నా. ప్రధాని నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రతి బీజేపీ సభ్యుడి ఉమ్మడి బాధ్యత” అని కంగన పేర్కొన్నారు. అంతకుముందు ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇవన్నీ తన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీతో వీటికి ఎలాంటి సంబంధం లేదని పోస్ట్ చేశారు.
Read Also: Ntr On Drug Awareness : డ్రగ్స్‌కి బానిస కావద్దంటూ దేవర పిలుపు
తన నియోజకవర్గం మండిలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన కంగనా రనౌత్ సాగుచట్టాలపై వ్యాఖ్యలు చేశారు. ”నాకు తెలుసు ఇది వివాదాస్పదమవుతుందని.. కానీ రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలి. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆ చట్టాలను మళ్లీ అమలుచేయాలి. దేశాభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే వారి శ్రేయస్సుకు ఉపయోగకరమైన ఆ చట్టాల కోసం రైతులే డిమాండ్ చేయాలి” అని ఆమె అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
ఈ నేపథ్యంలోనే కంగన వ్యాఖ్యలపై బీజేపీ దూరం పాటించింది. తాము వాటిని ఖండిస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఓ ప్రకటనలో వెల్లడించారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. బీజేపీ తరఫున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. వ్యవసాయ చట్టాలపై ఆమె అన్న మాటలు బీజేపీ వైఖరిని ప్రతిబింబించవని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వివాదంపై కంగన స్పందించారు. సాగు చట్టాల ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది పాటు వారు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన కేంద్రం.. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు 2021 నవంబరులో ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోడీనే దీనిపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. కంగన వ్యాఖ్యలను బీజేపీ విభేదించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. రైతుల నిరసనలపై ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆమెను మందలించింది. పార్టీ విధానంపై మాట్లాడే అధికారం ఆమెకు లేదని స్పష్టం చేసింది.