Site icon HashtagU Telugu

Parliament : జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించాలని లోక్‌సభ, రాజ్యసభ, ఎంపీల నోటీసులు.

Parliament

Parliament

Parliament : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తొలగింపుపై దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. మార్చి 2025లో ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ వర్మ ప్రవర్తనపై తీవ్రమైన ఆరోపణలు నిర్ధారించడంతో, ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే చర్యలు వేగవంతమయ్యాయి.

2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలోని 30 తుగ్లక్ క్రెసెంట్‌లో వర్మ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అగ్నిని ఆర్పే క్రమంలో భారీగా ₹500 నోట్ల కట్టలు, కొన్నింటి ముక్కలు కాలిపోయిన స్థితిలో గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తర్వాత మీడియాలో వైరల్ అవ్వడం వల్ల విషయం మరింత సీరియస్ అయింది.

విచారణలో భాగంగా సుప్రీంకోర్టు నియమించిన 3 సభ్యుల ఇన్‌హౌస్ కమిటీ 55 మంది సాక్షులను ప్రశ్నించింది. కమిటీ నివేదిక ప్రకారం, ఈ నగదు నిల్వ కోసం వర్మ కుటుంబం గోప్యమైన స్టోర్‌రూమ్‌ను ఉపయోగించినట్లు సాక్ష్యాలతో తేలింది. నగదు మొత్తం ₹15 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా, అయితే అధికారికంగా ఖచ్చితమైన సంఖ్య వెల్లడించలేదు.

ఆర్టికల్‌ 124, 217, 218 ప్రకారం న్యాయమూర్తిని తొలగించడానికి లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ కేసులో 145 మంది ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం సమర్పించారు. కాంగ్రెస్, బీజేపీ, టిడిపి, జేడీయూ, జేడీఎస్, షివసేన (శిండే), జనసేన, లోజపా వంటి పలు పార్టీల ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు.

రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని నిబంధన. ఇప్పటికే 63 మంది ప్రతిపక్ష ఎంపీలు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్‌కు అభిశంసన నోటీసు ఇచ్చారు. ఇది రెండు సభల్లోనూ అభిశంసన ప్రక్రియకు తగిన బలం సేకరించినట్లు సూచిస్తోంది.

అయితే తదుపరిస్పీకర్‌ లేదా చైర్మన్‌ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలి. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్, ఒక న్యాయ నిపుణుడు కలిసిన ప్రత్యేక కమిటీ ఏర్పడుతుంది. కమిటీ మూడు నెలల్లోపుగా పూర్తి నివేదిక సమర్పించాలి. నివేదికలో ఆరోపణలు నిజమని తేలితే, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రత్యేక మెజార్టీ ఓటుతో తీర్మానాన్ని ఆమోదించాలి.

ఇదిలా ఉంటే.. వర్మ తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరించారు. కమిటీ విచారణ సరైన విధంగా జరగలేదని, తాను సాక్ష్యాలను సమర్పించే అవకాశం పొందలేదని ఆయన వాదిస్తున్నారు. ప్రస్తుతం వర్మ సుప్రీంకోర్టులో కమిటీ నివేదికను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Asia Cup 2025: ఆసియా క‌ప్ ఎఫెక్ట్‌.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్‌?!