Social Media: ఫేస్‌బుక్ సహా సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. తీర్పులపై అభిప్రాయాలు వ్యక్తం చేరయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు వారు రుషుల్లా జీవిస్తూ అశ్వాల్లా పనిచేయాలని జస్టిస్‌లు నాగరత్న, కోటీశ్వర్ సింగ్ బెంచ్ పేర్కొంది. అలాచేస్తే భవిష్యత్తు విచారణల్లో ఆ తీర్పులను కోట్ చేయాల్సొస్తే ఇబ్బంది తప్పదని వెల్లడించింది. న్యాయవ్యవస్ధలో ఆడంబరానికి తావు లేదని వ్యాఖ్యానించింది. ప్రొబేషన్ సమయంలో సంతృప్తికరంగా పని చేయలేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు మహిళా న్యాయాధికారుల్ని తొలగించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇందులో ఒకరు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
ఏ న్యాయమూర్తి అయినా తమ పనికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని లాయర్ బసంత్ పేర్కొన్నారు. దాని వల్ల కలిగే ప్రమాదాలను కూడా వివరించారు. ముఖ్యంగా న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు ప్రజలపై చాలా ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చారు. ఇదంతా విన్న ధర్మాసనం.. న్యాయమూర్తులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపింది. అలాగే వారు ఈ రంగంలో కొనసాగాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందని.. న్యాయరంగం అలాంటి అత్యున్నత స్థానంలో ఉంటుందని వివరించింది.
కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో ఆరుగురు మహిళా సివిల్ జడ్జీలపై కేసును రద్దు చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. వీరిలో నలుగురిని పునఃపరిశీలన తర్వాత తిరిగి చేర్చుకున్నారు. కానీ ఇద్దరు అదితి కుమార్ శర్మ, సరితా చౌదరిని మాత్రం తీసుకోలేదు. 2017, 2018లో నియమితులైన ఈ న్యాయమూర్తులు తమ ప్రొబేషన్ వ్యవధిలో పనితీరు ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యారంంటూ జూన్ 2023లో ఉద్వాసనకు గురయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.