Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సోమవారం బిల్లుకు ఆమోదం తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యారు. జేపీసీ సమావేశానంతరం కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆ వివరాలను వెల్లడించారు. మొత్తం 44 సవరణలు చర్చకు వచ్చాయి. సభ్యులందరిని సవరణలు సూచించాల్సిందిగా కోరాం. 6 నెలలపాటు సమగ్ర చర్చ జరిపాం. ఇదే మా చివరి సమావేశం. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. విపక్షాలు సైతం సవరణలు సూచించాయి. ప్రతి సవరణను ఓటింగ్‌కు పెట్టాం అన్నారు.
అయితే వారు సూచించిన సవరణలను సమర్ధిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయి అని జగదాంబిక పాల్ తెలిపారు. ఇక, కమిటీ ప్రతిపాదించిన 14 మార్పులపై జనవరి 29న ఓటింగ్ నిర్వహించి ఫిబ్రవరి 1 నాటికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. గత ఏడాది ఆగస్టులో ఏర్పాటైన జేపీసీ తన నివేదికను నవంబర్ 29, 2024లోగా సమర్పించాలని కోరగా, ఆ తర్వాత గడువును ఫిబ్రవరి 13 వరకు పొడిగించారు. బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 వరకు, రెండవ భాగం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు ఉంటుంది.
వక్ఫ్ బిల్లు సవరణలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు పలు సమావేశాలు నిర్వహించగా, చాలా వరకు గందరగోళంగానే ముగిశాయి. కమిటీ చైర్మన్ అధికార పక్షం వైపు మొగ్గు చూపుతున్నారని ప్రతిపక్ష ఎంపీలు వాగ్వాదానికి దిగారు. గత వారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ తన ఆందోళనను వ్యక్తం చేశారు.
గతంలో అసదుద్దీన్ ఒవైసీ, కల్యాణ్ బెనర్జీ సహా 10 మంది ప్రతిపక్ష ఎంపీలను కమిటీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా, వక్ఫ్ చట్టం-1995లో పలు మార్పులు తీసుకు వస్తూ కేంద్రం గత ఆగస్టులో బిల్లు తీసుకువచ్చింది. అనంతరం బిల్లు పరిశీలనను 21 మంది సభ్యులతో కూడిన జేపీసీకి అప్పగించిన విషయం తెలిసిందే.
Read Also: 2 Years For Yuvagalam Padayatra : రాష్ట్ర భవిత మార్చిన భరోసా యాత్ర