Private Tuitions Ban: ప్రైవేట్ ట్యూషన్స్ బ్యాన్.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..!

ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రవేట్ ట్యూషన్స్ నిర్వహించడాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిషేధించింది.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 03:15 PM IST

ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రవేట్ ట్యూషన్స్ నిర్వహించడాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాల్లోని టీచింగ్ ఫ్యాకల్టీ ఎటువంటి విద్యా సంస్థల్లో, కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్పకూడదని అధికారులు పేర్కొన్నారు. అయితే తగిన అధికారి నుంచి మినహాయింపు తీసుకుంటే అనుమతి ఉంటుందని, నిబంధనను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.

జమ్మూకశ్మీర్ పాఠశాల విద్యా శాఖ ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకుండా పూర్తిగా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ప్రైవేట్‌ ట్యూషన్‌, కోచింగ్‌ సెంటర్లలో బోధించడాన్ని నిషేధిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అలోక్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుపైనా విధుల్లో ఉన్నా ప్రభుత్వోద్యోగి ఎవరూ ప్రైవేట్ వ్యాపారం చేయరాదని ఉత్తర్వులో పేర్కొంది. అదే విధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులెవరూ ప్రైవేట్ ట్యూషన్, కోచింగ్ సెంటర్లలో బోధించకూడదని పేర్కొంది.

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కొందరు ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో బోధిస్తున్నారని, ఇది నేరుగా విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు అందుతున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పని చేయకూడదని విద్యాశాఖ స్పష్టమైన నిబంధన పెట్టింది. ఉపాధ్యాయుల ప్రైవేట్ ట్యూషన్‌ను పర్యవేక్షించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ మండల స్థాయిలో మండల విద్యా అధికారిని, జిల్లా స్థాయిలో జిల్లా విద్యా అధికారిని నోడల్ అధికారిగా నియమించారు.

దీంతో పాటు ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా త్వరలో ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్లను జారీ చేయనుంది. అంతే కాకుండా తమ పరిధిలోని ఏరియాలో ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకుండా ఉండేందుకు విద్యాశాఖ అధికారులందరినీ ప్రభుత్వం బాధ్యులని చేసింది. మరోవైపు.. ఈ ఉత్తర్వులను జమ్మూ కాశ్మీర్ టీచర్స్ ఫోరమ్ ప్రావిన్షియల్ హెడ్ కుల్దీప్ సింగ్ బండ్రాల్ స్వాగతించారు. దీంతో ఉపాధ్యాయుల ధ్యాస పిల్లలపైనే ఉంటుందని బడిలోని చిన్నారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో ప్రైవేట్ ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారని, వారి దృష్టి ట్యూషన్‌పైనే కేంద్రీకృతమైందని దీంతో పాఠశాలలో విద్యాబోధన దెబ్బతింటోందని ఆ శాఖకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.