50 Years – Pension : 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌.. గిరిజనులు, దళితులు, ఆదివాసీలకు వయోపరిమితి తగ్గింపు

  • Written By:
  • Updated On - December 29, 2023 / 03:52 PM IST

50 Years – Pension : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వృద్ధాప్య పింఛన్‌పై సంచలన ప్రకటన చేశారు. ఇకపై 60 ఏళ్లకు బదులు 50 ఏళ్ల నుంచే గిరిజనులు, దళితులకు వృద్ధాప్య  పింఛను అందిస్తామని ప్రకటించారు. జార్ఖండ్‌లోని హేమంత్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలోని మోరబాది గ్రౌండ్‌లో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రతి కంపెనీలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు.‘‘పోరాడి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించాం. ఇది వీర యోధుల రాష్ట్రం. ఇక్కడి ప్రజలు ఆత్మబలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మాకు భిక్షలో ఎవరూ ఇవ్వలేదు. అంతకుముందు రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తులు నాశనం చేశారు. మా ప్రభుత్వం ఏర్పడితే ఢిల్లీ నుంచి నడవదని చెప్పాం. చెప్పిన విధంగానే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘జార్ఖండ్‌ చాలా పేద రాష్ట్రం. ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, రహదారి వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. జార్ఖండ్‌లో వనరుల కొరత తీవ్రంగా ఉంది. పేద రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం చేరిపోయింది’’ అని ఈసందర్భంగా హేమంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థితిగతులు బాగా లేకపోయినా.. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ దిశగా నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. ‘‘చెప్పులు అమ్మేవాడిని విమానంలో తీసుకెళ్తామని మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష బీజేపీ చెప్పేది. కానీ గత బీజేపీ హయాంలో అలా జరగలేదు. ఆ పేదలను రోడ్డున పడేశారు. మేం పేదల ఉద్ధరణ కోసం కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాం’’ అని జార్ఖండ్ ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read: Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సోనియాగాంధీ ?