Jharkhand : విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన జార్ఖండ్ సీఎం

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 04:17 PM IST

అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమ‌వారం విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గారు. ప్రత్యేకంగా ఒక రోజు పెట్టిన అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ ఓటింగ్‌కు ముందు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.

ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం కు చెందిన హిమంత బిస్వా శర్మ “జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం”లో పాలుపంచుకున్నారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ శాసనసభ్యులను కొనుగోలు చేస్తుందని, దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని నియమించిన తర్వాత గిరిజన ముఖ్యమంత్రిని గద్దె దించాలని చూస్తున్నారని అన్నారు.

అధికార సంకీర్ణ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని రాంచీకి తిరిగి వెళ్లారు. వారిని ఒక విలాసవంతమైన రిసార్ట్‌లో నిర్బంధించారు. రాష్ట్ర అతిథి గృహంలో ఎమ్మెల్యేలు కలిసి రాత్రి బస చేసి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు.

మైనింగ్ లీజుకు ఇవ్వడం ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని బీజేపీ చెబుతోంది. పార్టీ తాజా ఎన్నికలకు పిలుపునిచ్చింది. “నైతిక కారణాలతో” ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఒకవేళ సోరెన్‌ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడితే, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేరు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , కర్నాటక వంటి రాష్ట్రాలలో ఉన్న పద్ధతిని అనుసరించి సంకీర్ణ‌ ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని సోరెన్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ గవర్నర్‌కు తన అభిప్రాయాన్ని సమర్పించింది. ఆయన ఏ రోజైనా సోరెన్‌పై తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. 81 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మెజారిటీ మార్క్ 41. అతిపెద్ద పార్టీ అయిన JMMకి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18 మంది, తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (RJD)కి ఒకరు ఉన్నారు.