Site icon HashtagU Telugu

CM Missing : జార్ఖండ్‌ సీఎం మిస్సింగ్.. 24 గంటలుగా కనిపించని సొరేన్

Hemant Soren

Hemant Soren Vs Ed

CM Missing :  కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్‌తో వణుకుతున్న జార్ఖండ్‌‌ను రాజకీయ అనిశ్చితి ఆవరించింది.  గత 24గంటలుగా సీఎం హేమంత్ సొరేన్ కనిపించడం లేదు. భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల విచారణలో భాగంగా సోమవారం రోజు ఈడీ అధికారులు ఢిల్లీలోని సీఎం సొరేన్ నివాసానికి వెళ్లారు. అయితే ఈడీ టీమ్ చేరుకోవడానికి ముందే.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.  అప్పటి నుంచి సొరేన్ కనిపించడం లేదని సమాచారం. దీంతో ఈడీ ఎయిర్ పోర్టు, రోడ్లు మార్గాలపైనా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. సీఎం సొరేన్ గురించి సమాచారం ఉంటే తెలియజేయాలని జార్ఖండ్ పొరుగు రాష్ట్రాల పోలీసులకు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. హేమంత్ సొరేన్, ఆయన సన్నిహితుల పోన్లన్నీ స్విచ్చాఫ్ వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సొరేన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరారని ఈడీకి ఇన్ఫో అందింది. దీంతో విమానయాన శాఖతో మాట్లాడి..  సొరేన్ బుక్ చేసుకున్న ఫ్లైట్‌ను ఈడీ రద్దు చేయించింది. అందుకే రోడ్డు మార్గంలో సీఎం సొరేన్ ఢిల్లీ నుంచి జార్ఖండ్‌కు(CM Missing) బయలుదేరి ఉంటారని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హేమంత్ సోరెన్‌ను జార్ఖండ్‌లోనే అరెస్టు చేయనున్నారనే ఊహాగానాల మధ్య రాష్ట్ర రాజధాని  రాంచీలో భద్రతను పెంచారు. సీఎం నివాసంతో పాటు ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసి 14 మంది అదనపు పోలీసు అధికారులను సైతం రాజధానిలో మోహరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అధికారులు రాంచీలోనే ఉండాలని పేర్కొంది.  హేమంత్ సోరెన్ సోమవారం సాయంత్రం ఈడీకి ఓ మెయిల్ పంపినట్టు సమాచారం. జనవరి 31న మధ్యాహ్నం 1 గంటలకు రాంచీలోని తన నివాసానికి విచారణకు రావొచ్చని మెయిల్‌లో పేర్కొన్నారు.

Also Read : Ganja Chocolates : చాక్లెట్ల అవతారమెత్తిన గంజాయి.. ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్

ముఖ్యమంత్రి క్షేమంగా, తమతో టచ్‌లోనే ఉన్నారని ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా తెలిపింది. సీఎం త్వరలోనే రాంచీకి వస్తారని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఈ మీటింగ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. శాసనసభ్యులంతా రాజధానిని విడిచి పెట్టొద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు వెల్లడించారు. అయితే తదుపరి సీఎంగా హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ఈ భేటీ జరగబోతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లు జార్ఖండ్‌లో అధికార కూటమిలో భాగంగా ఉన్నాయి.