JEE 2025 : దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జనవరి సెషన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. గడువు సమయం ముగిసే నాటికి సుమారు 13.8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 28న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియలో మొదటి రెండు వారాల్లో కేవలం 5.10 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గిపోవచ్చని అనుకున్నా, చివరికి అంచనాలను అధిగమిస్తూ 13.8 లక్షల మందికి పైగా దరఖాస్తులు అందాయి.
నవంబర్ 22 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. కానీ, గత ఏడాది తో పోల్చితే ఈసారి స్వల్పంగా దరఖాస్తులు తగ్గినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఎన్టీఏ ఇంకా వెల్లడించలేదు. అయితే, జేఈఈ జనవరి సెషన్ పరీక్షలు 2025 జనవరి 22 నుంచి 31 వరకు జరగనున్నాయి. రెండవ సెషన్ ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డులు 2025 జనవరి 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది జేఈఈ పరీక్షలో కొన్ని మార్పులు చేసారు. 2020 కోవిడ్ సమయంలో జేఈఈ సెక్షన్ Bలో ఉన్న ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని తొలగించి, 10 ప్రశ్నలకు బదులుగా 5 ప్రశ్నలు మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు.అలాగే, న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ విధానం ప్రవేశ పెట్టారు. అంటే, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ఈ ప్రశ్నలకు తప్పుల కోసం మార్కుల కోత ఉంటుంది.
అదే విధంగా, వయోపరిమితి గురించి సడలింపులు తీసుకున్నారు. ఇప్పుడు 12వ తరగతి అర్హత ఉన్న ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది, జేఈఈ పరీక్షా నగరాల సంఖ్యను 300 నుంచి 284కు తగ్గించారు. అంతేకాక, ఇతర దేశాల్లోని పరీక్ష కేంద్రాల సంఖ్యను 24 నుండి 14కు కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్‌లోని పరీక్ష కేంద్రాలు తొలగించి, బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యుఏఈ లలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
Read Also : Weather Updates : తెలంగాణలో ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్