Grand Alliance:కాంగ్రెస్ తో గ్రాండ్ అల‌యెన్స్ దిశ‌గా `జ‌న‌తాప‌రివార్‌`

గ్రాండ్ అల‌యెన్స్ దిశ‌గా దేశ రాజ‌కీయం మారుతోంది. ఎన్డీయే నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌కొచ్చిన నితీష్ కుమార్, లాలూ సోనియాతో ఆదివారం భేటీ కానున్నార‌నే అంశం స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 12:45 PM IST

గ్రాండ్ అల‌యెన్స్ దిశ‌గా దేశ రాజ‌కీయం మారుతోంది. ఎన్డీయే నుంచి ఇటీవ‌ల బ‌య‌ట‌కొచ్చిన నితీష్ కుమార్, లాలూ సోనియాతో ఆదివారం భేటీ కానున్నార‌నే అంశం స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. భార‌త్ జోడో యాత్ర‌కు మ‌ద్ధ‌తు పలుకుతూ రాహుల్ కు నితీష్‌, తేజ‌స్వీ యాద‌వ్ ముందుకు క‌దిలిన క‌లిసిన విష‌యం విదితమే. ఇప్పుడు తాజాగా లూలూ, నితీష్ ఢిల్లీ వేదిక‌గా సోనియాతో భేటీ కావ‌డం వెనుక‌ గ్రాండ్ అల‌యెన్స్ ఏర్పాటు దిశ‌గా అడుగులు పడుతున్నాయ‌ని తెలుస్తోంది.

గ‌త కొంత కాలంగా యూపీఏ ఉనికి కోల్పోయింద‌ని చ‌ర్చ జ‌రిగింది. ఆ విష‌యాన్ని ప్ర‌శాంత్ కిషోర్ తో పాటు మ‌మ‌త కూడా ఒకానొక సంద‌ర్బంలో వ్యాఖ్యానించారు. ఆ త‌రువాత ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ కూడా యూపీఏ మ‌నుగ‌డ మీద అనుమానాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. కానీ, ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిషోర్‌, నితీష్ వేస్తోన్న అడుగులు యూపీఏ మ‌ళ్లీ మ‌నుగ‌డలోకి వ‌స్తుంద‌న్న సంకేతాల‌ను ఇస్తున్నాయి. అంతేకాదు, కేసీఆర్, నితీష్ మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ సంప్ర‌దింపులు కూడా మోడీ వ్య‌తిరేక కూట‌మికి నాంది ప‌లుకుతోంది.

ఆరేళ్ల తర్వాత సోనియా, నితీశ్ కుమార్ తొలిసారి కలుసుకోబోతున్నారు. 2015లో బీహార్ ఎన్నికలకు ముందు ఒక ఇఫ్తార్ విందులో చివరి సారి సోనియా, నితీశ్ క‌లిసిన విష‌యాన్ని ఢిల్లీ వ‌ర్గాలు గుర్తు చేస్తున్నారు. ఎల్లుండి జరగబోయే సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరైతే బాగుంటుందని లాలూ, నితీష్ కోరుతున్నారు. అయితే, భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు రాహుల్ గాంధీని నితీశ్ కలిశారు. ఆ సమయంలో వైద్య చికిత్స నిమిత్తం సోనియాగాంధీ విదేశాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. దీంతో ఆదివారం కీల‌క భేటీ ఆమెతో జ‌ర‌గ‌నుంది.

జాతీయ ప్ర‌త్యామ్నాయం కోసం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇప్ప‌టికే వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల చీఫ్ ల‌ను క‌లుసుకున్నారు. బీజేపీయేత‌ర పార్టీల‌ను ఒక చోట‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, విప‌క్షాల మధ్య ఐక్య‌త కుద‌ర‌డంలేదు. ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఆశిస్తోన్న మ‌మ‌త‌, కేజ్రీవాల్‌, శ‌ర‌ద‌ప‌వార్‌, నితీష్‌, కేసీఆర్ మ‌ధ్య వేర్వేరుగా రాజ‌కీయ ఈక్వేష‌న్లు ఉన్నాయి. అందుకే పైకి క‌లిసిన‌ట్టుగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రి పంథాలో వాళ్లు రాజ‌కీయాల‌ను చేస్తున్నారు.

భార‌త్ జోడో యాత్ర త‌రువాత కాంగ్రెస్ లేకుండా అల‌యెన్స్ క‌ష్ట‌మ‌ని విప‌క్షాలు భావిస్తున్నాయి. యూపీఏలో భాగ‌స్వాములుగా ఉన్న పార్టీలు పోగా మిగిలిన విప‌క్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ అండ‌ను ఇప్పుడు కోరుకుంటున్నాయి. క‌మ్యూనిస్ట్ లు, టీఆర్ఎస్, జేడీయూ, జేడీఎస్ త‌దిత‌ర పార్టీలు ఇప్పుడు క‌లిసి ముందుకు న‌డిచే అవ‌కాశం ఉంది. ఆ దిశ‌గా అడుగులు వేయ‌డానికి నాంది ప‌లికేలా ఆదివారం సోనియాతో భేటీ ఉంటుంద‌ని జ‌న‌తా ప‌రివార్ భావిస్తోంది.