Agencies Warning : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. కశ్మీర్‌లో రాజకీయ నాయకులు, పలు రాజకీయ పార్టీల ముఖ్య కార్యకర్తలపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపాయి. వీరితో పాటు భద్రతా బలగాలు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, స్థానికేతరులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే ముప్పు(Agencies Warning) ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
బారాముల్లా జిల్లాలోని మొఘల్ పోరా గ్రామంలోని తోటల్లో ఇటీవలే ముగ్గురు అనుమానిత వ్యక్తులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిని విచారించగా కశ్మీర్‌లో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఎన్నికల వేళ ఏదో ఒక రకంగా కశ్మీర్‌లో అలజడిని క్రియేట్ చేయాలని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భావిస్తున్నట్లు తెలిసింది. కుప్వారా ప్రాంతంలోని తంగ్‌ధర్ ఏరియాలో ఇద్దరు ఉగ్రవాదులు రహస్యంగా కదలికలు సాగిస్తున్నట్లు సమాచారం. వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలకు చెందిన స్పెషల్ సెర్చ్ పార్టీలు పనిచేస్తున్నాయి.
బుధవారం రోజు కశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈనేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకార దాడులకు పాల్పడే ముప్పు ఉంది. ప్రత్యేకించి స్థానికేతరులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ సహా పలు రాష్ట్రాలకు చెందినవారు కశ్మీర్‌కు వచ్చి ఉపాధి పొందుతుంటారు. యాపిల్ తోటల్లో, ఇతరత్రా చోట్ల వారు పనులు చేస్తుంటారు. అలాంటివారికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని అంటున్నారు. ఈనేపథ్యంలో కశ్మీర్‌లోని అన్ని సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.