Site icon HashtagU Telugu

Jammu Kashmir Cloud Burst : జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్..అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి..?

Jammu Kashmir Cloud Burst

Jammu Kashmir Cloud Burst

జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir) లో వర్షాలు ధారాళంగా కురుస్తున్న నేపథ్యంలో రాంబన్‌ జిల్లాలో చోటు చేసుకున్న క్లౌడ్‌ బరస్ట్‌ (Cloud Burst) తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్‌ హైవేను పూర్తిగా స్తంభింపజేశాయి. అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. హైవే పక్కనే ఉన్న గ్రామాల్లోకి వరదనీరు వచ్చిపోవడంతో దాదాపు 10 ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. 20-30 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ మేఘ విస్ఫోటనం ధర్మకుండ్ ప్రాంతంలోని ప్రజలను తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది. అయితే వెంటనే స్పందించిన పోలీసులు దాదాపు వంద మందిని సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రహదారుల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నప్పటికీ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు.

క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? ఎందుకు జరుగుతుంది..?

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక చిన్న ప్రాంతంలో (1-10 కిలోమీటర్ల పరిధిలో) గంట వ్యవధిలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దానిని క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. ఇది సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుంది. దీనికి కారణం రుతుపవనాలు మరియు వెస్ట్రన్ డిస్టర్బెన్స్‌ల ప్రభావం. ఇవి పరస్పరం ఢీకొనడం వల్ల ఏర్పడిన మేఘాలు అధిక తేమతో కూడి, తక్కువ సమయంలో భారీ వర్షాన్ని కురిపిస్తాయి. ఇది తక్షణమే వరదలు, కొండచరియల రూపంలో ప్రాణ, ఆస్తినష్టానికి దారితీస్తుంది.
ఇలాంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్వత ప్రాంతాల్లో మానవ జీవనానికి ప్రమాదాలు తప్పవని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.