Jammu and Kashmir Elections : జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పోటీచేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ క్రమంలోనే తొలి విడత ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల పేర్లను కూడా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తొలిదశ ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ మాజీ ప్రధాన కార్య దర్శి, ఇటీవలే జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులైన రామ్ మాధవ్, జమ్మూకశ్మీర్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్, జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ, రాజ్యసభ సభ్యుడు గులాం అలీ ఖతన, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కౌల్, జమ్మూకశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడు సోఫి యూసుఫ్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
కాగా, జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ మొదటి దశ, 25వ తేదీన రెండో దశ.. అక్టోబర్ 1వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. కాగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న జరుగుతుంది. 2019లో 370వ అధికరణ రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించిన తరువాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం.