Site icon HashtagU Telugu

Indus Water Treaty: పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై.. సీఎం ఒమర్, మాజీ సీఎం మెహబూబా మ‌ధ్య మాటల యుద్ధం

Mebooba Mufti Vs Omar Abdullah

Mebooba Mufti Vs Omar Abdullah

Indus Water Treaty: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్‌,పాకిస్థాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌వ‌టంతో భార‌త్ ప్ర‌భుత్వం సింధూ జ‌లాల ఒప్పందాన్ని నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో వులర్ సరస్సుపై గతంలో తలపెట్టిన ‘తుల్‌బుల్’ నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. తాజాగా.. ఇదే విష‌యాన్ని ఒమర్ అబ్దుల్లా ట్విట‌ర్ వేదిక‌గా పంచుకోగా.. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు. దీంతో శుక్రవారం ఆ ఇద్ద‌రు నేత‌ల మధ్య ట్విట‌ర్ వేదిక‌గా మాట‌ల యుద్ధం చోటుచేసుకుంది.

 

ఉత్తర కశ్మీర్‌లోని వులార్ సరస్సు పునరుద్ధరణకు 1987లో తుల్‌బుల్‌ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను నాటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే సింధు జలాల ఒప్పదం ఉల్లంఘనగా పేర్కొంటూ పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో 2007లో ఈ ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఒమ‌ర్ అబ్దుల్లా శుక్ర‌వారం ట్వీట్ చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆగిపోయిన తుల్‌బుల్‌ నావిగేషన్ ప్రాజెక్ట్‌ను మనం తిరిగి ప్రారంభించగలమా? అని పేర్కొన్నారు. జీలం నావిగేషన్‌తో పాటు విద్యుత్ ఉత్పత్తిని కూడా ఈ ప్రాజెక్ట్‌ పెంచుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా అభిప్రాయాన్ని మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు.

 

మెహ‌బూబా ముఫ్తీ ట్వీట్ ప్ర‌కారం.. ”భారత్-పాక్ మధ్య ఉద్రిత్తల నేపథ్యంలో తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూ సీఎం చెప్పడం దురదృష్టకరం. జమ్మూకశ్మీర్‌లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయి తీవ్ర నష్టంతో కడగండ్ల పాలైన పరిస్థితిలో సీఎం వ్యాఖ్యలు ప్రమాదకరంగా, ఉద్రికత్తలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. అత్యంత అవసరమైన, జీవనాధారమైన నీటిని ఆయుధంగా మార్చడం అమానవీయం. ద్వైపాక్షిక అంశాలను అంతర్జాతీయంగా మార్చే ప్రమాదం కూడా ఉంది” అని పేర్కొన్నారు. దీంతో ముఫ్తీ వ్యాఖ్య‌ల‌కు ఒమర్‌ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

చౌకబారు ప్రచారం కోసం, సరిహద్దు అవతల ఉన్న కొందరిని సంతోషపెట్టేందుకు ముఫ్తీ చేస్తున్న గుడ్డి కోరిక ప్రయత్నమని ఆరోపించారు. అయితే ఎవరి ప్రసన్నం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో అన్నది కాలం చెబుతుందంటూ ముఫ్తీ కౌంటర్ ఇస్తూ ఒమ‌ర్ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.